రాజకీయాలు ప్రజాహితం కోసమే అని నినదించి సమాజాన్ని దేవాలయంగా భావించి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ప్రజాసేవకుడు అన్న శ్రీ నందమూరి. ఆయన శతవసంత జన్మదినోత్సవం సందర్భంగా ఆస్ట్రేలియాలో సిడ్నీ నగర తెలుగు ప్రజానీకం ఆ కారణజన్ముడి శతజయంతి వేడుకలు ఘనంగా జరుపుకుంది.
తెలుగుదేశం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు కేవలం సిడ్నీ నుండే కాకుండా కాన్బెర్రా, న్యూ క్యాజిల్ నగరాల నుండి కూడా తెలుగువారు భారీగా తరలివచ్చి ఆ పుణ్యపురుషుని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి సినీనటులు శివాజీ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఆరుగంటలు ఏకధాటిగా జరిగిన ఈ వేడుకలలో అనేక మంది చిన్నారులు, పెద్దలు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆహూతులను ఆద్యంతం అలరించారు.
వేడుకకి హాజరైనవారికి తెలుగింటి వంటకాలతో పసందైన విందు ఏర్పాట్లు చేసారు. ఎన్టీఆర్ జీవిత ముఖ్యఘట్టాలతో ఏర్పాటు చేసిన డిజిటల్ ఫోటో ప్రదర్శన, అయన నటవిశ్వరూపాన్ని ఆవిష్కరించిన చిత్ర సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ కటౌట్లతో ఏర్పాటు చేసిన ఫోటోబూత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఆస్ట్రేలియాలో వివిధ రంగాలలో విశేష సేవలు అందించే తెలుగువారిని గుర్తించి ఎన్టీఆర్ అవార్డులతో సత్కరించే తెలుగుదేశం ఆస్ట్రేలియా సంస్థ 2023 సంవత్సరానికి కార్డియో వాస్క్యూలర్ వ్యాధి నివారణకు విశేష కృషి చేసిన ప్రముఖ కార్డియాలజిస్ట్ ప్రొఫెసర్ క్లారా చౌ మరియు పబ్లిక్ సర్వీసెస్, జ్యూడిషరీ రంగాలలో అందించిన సేవలకు గాను న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర జ్యూడిషరీ కమిషన్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీ. మురళి సాగి గార్లను ఎన్టీఆర్ అవార్డులతో సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మెడికల్ క్యాంపులు నిర్వహించిన డాక్టర్ క్లారా చౌ తెలుగింటి కోడలు కూడా. ఈ సందర్భంగా డాక్టర్ క్లారా తనకు ఆంధ్రప్రదేశ్ తో ఉన్న అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎన్టీఆర్ పురస్కారాన్ని అందుకున్నందుకు సంతోషం వ్యక్తం చేసారు. ఎన్టీఆర్ అభిమానిని అయిన తాను నేడు ఎన్టీఆర్ అవార్డును అందునా అయన శతజయంతి సందర్భంగా అందుకోవటం తన అదృష్టమని శ్రీ మురళి సాగి పేర్కొన్నారు.
ముఖ్య అతిథి, నటులు శివాజీ మాట్లాడుతూ.. నటుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్ చేసిన సేవలను, ముఖ్యమంత్రిగా చేపట్టిన సంస్కరణలను గుర్తు చేస్తూ ఎన్టీఆర్ లాంటి మహోన్నత మనిషి, నిస్వార్ధ నాయకుడు యుగానికి ఒక్కరే ఉంటారని, అయన తెలుగు జాతికే గర్వకారణం అని కొనియాడారు. అయన గురించి నేటి తరాలకు తెలియజేస్తూ వివిధ సామజిక కార్యక్రమాలను చేపడుతున్న తెలుగుదేశం ఆస్ట్రేలియా సంస్థను ప్రశంసించారు.
తెలుగుదేశం ఆస్ట్రేలియా ప్రతినిధులు మాట్లాడుతూ ఆ మహనీయుడి జన్మదినం వేలమంది అభిమానుల సమక్షంలో జరుపుకోవటం గర్వంగా ఉందని, ఈ ప్రత్యేక సందర్భాన రక్తదానం చేసిన ఎన్టీఆర్ అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వేడుక సజావుగా సాగేందుకు సహకరించిన వాలంటీర్లకు కృతఙ్ఞతలు తెలిపారు.