నార్త్ కెరొలినా రాష్ట్రం, చార్లెట్ నగరంలో నందమూరి తారక రామారావు (NTR) శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రావిడెన్స్ పాయింట్ లో ఎన్నారై టీడీపీ (NRI TDP) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు సుమారు 250 మంది తెలుగువారు హాజరయ్యారు.
జూన్ 4, ఆదివారం సాయంత్రం 5 గంటలకు జ్యోతి వెలిగించి, ఎన్టీఆర్ చిత్ర పఠానికి పూలతో నివాళులు అర్పిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ మహానుభావుని 100 సంవత్సరాల వేడుకలలో జీ టీవీ సరిగమప (ZEE TV SaReGaMaPa Championship) ఛాంపియన్షిప్ విజేత చిన్నారి వాగ్దేవి (Vagdevi) ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వయస్సులోనే చిన్న, మరెందులోనూ చాటిలేదనేలా చిన్నారి వాగ్దేవి తన ప్రతిభాపాఠవాలను చాటింది. అందరి ముందూ ఎటువంటి బెరుకు లేకుండా 5 పాటలు పాడి మన్ననలు పొందింది. ఇక మేజర్ చంద్రకాంత్ సినిమాలోని ‘పుణ్యభూమి నా దేశం’ పాటకైతే తన హావభావాలు చూసి పలువురు వేదిక మీదకి వెళ్లి మరీ ఆ చిన్నారిని ఎత్తుకొని అభినందించారు.
అలాగే స్థానిక మహిళలు కొంతమంది అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా అన్న (Nandamuri Taraka Ramarao) గారి గుండమ్మ కథ సినిమాలోని ‘లేచింది నిద్ర లేచింది మహిళా లోకం’ అంటూ చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది. దీంతోపాటు ఝాన్సీ అబ్బూరి డాన్స్ స్కూల్ విద్యార్థులు చేసిన మెడ్లీ డాన్స్ కనులవిందు చేసింది.
ఎన్టీఆర్ పుట్టినరోజు మే 28 ని తెలుగు హెరిటేజ్ డే గా సిటీ నుండి ప్రొక్లమేషన్ తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించిన రావు కొమ్మారెడ్డి మరియు చందు గొర్రెపాటి లను తెలుగువారందరూ అభినందించారు. గుణ సుందరి కొమ్మారెడ్డి ఆ ప్రొక్లమేషన్ ని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చార్లెట్ ఏరియా (TAGCA) ప్రతినిధులకు అందజేశారు.
ఈ సందర్భంగా రావు కొమ్మారెడ్డి మరియు గుణ సుందరి కొమ్మారెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు. ఆహ్వానితులను ఉద్దేశించి పురుషోత్తమ చౌదరి గుదే, నాగ పంచుమర్తి, వాణి గొర్రెపాటి, మణి పెళ్లూరు ఎన్టీఆర్ గురించి ప్రసంగించారు. అన్న ఎన్టీఆర్ మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత, గౌరవానికి సంబంధించి జ్యోత్స్న ఘంటా ప్రసంగించారు.
ఈ కార్యక్రమానికి రఘు వేముల మరియు ఝాన్సీ అబ్బూరి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. పలువురు ఎన్టీఆర్ సంభాషణలతో అలరించారు. పోయిన సంవత్సరం ఎన్టీఆర్ 99వ జయంతి నిర్వహించిన ప్రదేశంలోనే ఈ సంవత్సరం 100 సంవత్సరాల వేడుకలు చేయడం విశేషం.
వేదిక ప్రాంగణాన్ని అంతా అన్న నందమూరి తారక రామారావు (NTR) బ్యానర్లతో, తెలుగుదేశం పార్టీ జండాలతో, పసుపు బెలూన్లతో అలంకరించిన తీరుతో అంతా శోభాయమానంగా ఉంది. అందరూ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల (NTR 100 Years Birthday Celebrations) షర్ట్స్ ధరించారు.
నందమూరి తారక రాముని అభిమానులు, తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party – TDP) అభిమానులు, మహిళలు, చిన్నారులు తమ అభిమాన నటులు, రాజకీయ నాయకులు అయినటువంటి ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో ఉత్సాహంగా పాల్గొనడంతో ఈ కార్యక్రమం విజయవంతమైంది.
ఎన్టీఆర్ 100 సంవత్సరాల మైలురాయిని గుర్తుచేసేలా చిన్నారి వాగ్దేవి చేతుల మీదుగా కేక్ కట్ చేసి అందరికీ పంచారు. డిన్నర్ అనంతరం వందన సమర్పణతో చార్లెట్ లో ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao – NTR) శతజయంతి వేడుకలు ఘనంగా ముగిశాయి.