అంతర్జాలం, జనవరి 24: అమెరికా లో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా కర్ణాటక సంగీతం (Carnatic Music) లో ఉద్దండులైన నల్లాన్ చక్రవర్తుల బుచ్చయాచార్యులచే కర్ణాటక సంగీతంపై వెబినార్ నిర్వహించింది.
నాట్స్ తెలుగు లలిత కళా వేదిక ఆధ్వర్యంలో ప్రతి మాసం తెలుగు కళా ఉద్ధండులచే నాట్స్ అంతర్జాలం ద్వారా వెబినార్స్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ (NATS) ప్రముఖ వయాలిన్ విద్వాంసులు, సంగీత ఆధ్యాపకులు నల్లాన్ చక్రవర్తుల బుచ్చయాచార్యులను ఆహ్వానించింది.
కర్ణాటక సంగీతం (Carnatic Music) లో తమ కుటుంబం తరతరాలుగా ఎలా తెలుగు సంప్రదాయ వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ వస్తుందనేది బుచ్చయ్య చార్యులు వివరించారు. తన తండ్రి నల్లాన్ కృష్ణమాచార్యులు సంగీతం, సాహిత్యంపై ఎలా పట్టు సాధించారు. హరికథాగానంలో ఎలా ప్రావీణ్యం పొందారనే విషయాలను వివరించారు.
అలాగే విజయవాడ (Vijayawada) ఘంటసాల సంగీత కళశాలలో సంగీత ఆధ్యాపకుడిగా తన అనుభవాలను బుచ్చయ్య చార్యులు పంచుకున్నారు. నాట్స్ (NATS) చేపడుతున్న సేవా కార్యక్రమాలతో పాటు.. తెలుగు భాష పరిరక్షణకు చేపడుతున్న కార్యక్రమాలను నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (Bapu Nuthi) నూతి వివరించారు.
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు అమెరికాలో కూడా తెలుగువారు మరిచిపోకుండా ఉండేందుకు నాట్స్ (North America Telugu Society) అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యతగా నాట్స్ కార్యనిర్వాహక కార్యదర్శి (మీడియా) మురళీకృష్ణ మేడిచర్ల (Murali Medicherla) వ్యాఖ్యతగా వ్యవహరించారు.
నాట్స్ (North America Telugu Society) తెలుగు లలిత కళా వేదికలో విలువైన తన అనుభవాలను వివరించిన నల్లాన్ చక్రవర్తుల బుచ్చయాచార్యులను నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) అభినందించారు.