ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఎన్నికలలో అధ్యక్ష పదవికి కూతవేటు దూరంలో నిరంజన్ శృంగవరపు ఉన్నట్లు వినికిడి. తానా ఫర్ చేంజ్ అనే నినాదంతో గత కొన్ని నెలలుగా అమెరికాలోని అన్ని నగరాలలో తన పానెల్ కంటెస్టెంట్స్ తో కలిసి సుడిగాలి పర్యటనలు చేస్తున్న విషయం విదితమే. తానాలో ఉన్న కొందరి గుత్తాధిపత్యంతో విసిగి వేసారిపోయిన ప్రవాసాంధ్రులు ప్రతిచోటా నిరంజన్ టీంకి బ్రహ్మరథం పడుతున్నట్లు తెలుస్తుంది.
2008 నుండి తానాతో అనుబంధం కలిగిన నిరంజన్, వివిధ పదవులతోపాటు రెండు సార్లు తానా ఫౌండేషన్ చైర్మన్ గా వివాదరహితునిగా పేరు తెచ్చుకున్నారు. తన టీంలో యువత, మహిళలకి పెద్దపీట వెయ్యడం విశేషం. నిరంజన్‌కు కేవలం తానాలో మాత్రమే జీవిత కాల సభ్యత్వం ఉండడం తానా పట్ల తనకున్న నిబద్ధతను తెలియజేస్తుంది.
రాయలసీమ రైతు కుటుంబం నుండి వచ్చిన నిరంజన్ హైదరాబాద్‌లో కొంతకాలం సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేసి 2001లో అమెరికాకు వచ్చారు. నిరంజన్ కుటుంబం సర్వేష ట్రస్ట్ పేరిట సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తన అంటే ఒక్కరిది, తానా అంటే అందరిదీ అనే టీం నిరంజన్ నినాదం కూడా ప్రవాసుల్లోకి విస్తృతంగా వెళ్లడంతో తానా అధ్యక్ష పదవి నిరంజన్ శృంగవరపు వశమైనట్లేనని ప్రవాసులు అంటున్నారు.