రామాయణం అనే మాట వినగానే మనసులో ఏదో తెలియని అనుభూతి. మనందరం చిన్నప్పటి నుండి టీవీలో, సినిమాలో రామాయణ గాధ చూసి సంబరపడిపోయిన రామ తత్వ సందర్భాలు ఎన్నో ఉంటాయి. కాకపోతే సినీ పరిజ్ఞానం తప్పితే, నిజమైన రామాయణ గాధ కానీ, ఆ పౌరాణికంలోని ధర్మ సూక్ష్మం కానీ మనలో చాలా మందికి తెలియదు.
అసలు సిసలైన వాల్మీకి రామాయణాన్ని అమెరికాలో పుట్టిన పెరిగిన చిన్నారులకు వివరించి, వారితోనే నాటిక రూపంలో ప్రదర్శింప జేసే బృహత్తర కార్యక్రమాన్ని ఉగాది వేడుకలలో భాగంగా ఈనెల ఏప్రిల్ 20వ తేదీన చేపడుతోంది న్యూయార్క్ లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (Telugu Literary & Cultural Association). ఈ విషయంలో అటు చిన్నారులను ఇటు TLCA కార్యవర్గాన్ని అభినందించాల్సిందే.
దీనివలన మన భావి తరాల వారికి మన సంస్కృతి సంప్రదాయాలు తెలియజేయటం, మన ఇతిహాసాల మీద అవగాహన కలిగించడం, మన విలువలు తెలియజెప్పటం మరియు మన భాష ను ప్రోత్సహించటం జరుగుతుంది. మన భావితరాల వారిని మన వారసులుగా తీర్చి దిద్దే ప్రయత్నంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని రూపొందిస్తున్న TLCA అధ్యక్షులు కిరణ్ రెడ్డి పర్వతాల (Kiran Reddy Parvathala) గారు మరియు వారి కార్యవర్గ సభ్యులు ఎంతో అభినందనీయులు.
అమెరికాలో ఏర్పడిన మొట్టమొదటి తెలుగు సంఘం న్యూయార్క్ లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (Telugu Literary & Cultural Association – TLCA). తన పేరుకు తగినట్లుగా, పద్యానికి పట్టం కట్టటం, తీర్థయాత్రలు నిర్వహించటం, పౌరాణిక నాటకాలు ప్రదర్శించటం లాంటి అనేక కార్యక్రమాలను గతంలో నిర్వహించింది.