తెలంగాణా సంస్క్రతికి ప్రతిబింబంగా, ప్రవాస తెలంగాణ ప్రజల వారధిగా వెలిసిన న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) అప్రతిహంగా తన కార్యక్రమాలను చేపడుతూ అందరి మన్ననలు చూరగొంటూ విజయవంతంగా నాలుగవ సంవత్సరంలోకి అడుగిడింది.
డిసెంబర్ 1వ తేదీ శుక్రవారం, న్యూయార్క్ నగరం, మింట్ రెస్టారెంట్ వేదికగా జరిగిన 3వ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ “దావత్” ధూమ్ ధాంగా జరిగిన కార్యక్రమంలో 2024 సంవత్సరానికి గాను New York Telangana Telugu Association (NYTTA) సంస్థ తమ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది.
సంస్థ శ్రేయోభిలాషులు శ్రీ పైళ్ల మల్లారెడ్డి గారు ఇతర ముఖ్య అతిథులతో పాటు NYTTA సంస్థ చైర్మన్ డా. రాజేందర్ రెడ్డి జిన్నా, ఉపచైర్మన్ లక్ష్మణ్ రెడ్డి అనుగు, కార్యదర్శి సతీష్ కల్వ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉషారెడ్డి మన్నెం, సహోదర్ పెద్దిరెడ్డి, పవన్ కుమార్ రవ్వ, మల్లిక్ రెడ్డి, డా. వేణుగోపాల్ పల్లా, డా. కృష్ణ బాధే మరియు రమ కుమారి వనమ పాల్గొన్న ఈ సభ విజయవంతంగా జరిగింది.
నైటా బి ఓ డి సెక్రటరీ సతీష్ కల్వ గారు ప్రారంభ ఉపన్యాసం ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని చిన్నారి గాయకుడు భవిన్ కొట్ట గణపతి ప్రార్థన గీతంతో ప్రారంభించాడు. అనంతరం ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ పైళ్ల మల్లారెడ్డి గారు, బి ఓ డి సభ్యులు, ఈసీ సభ్యులు, అడ్వైజరీ కమిటీ అందరూ కలిసి జ్యోతి ప్రజ్వలన గావించారు.
చైర్మన్ రాజేందర్ రెడ్డి జిన్నా గారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. సినీ గాయకుడు వేణు శ్రీరంగం (Venu Srirangam) గారు మరియు ఇప్పుడే వృద్ధిలోకి వస్తున్న గాయని కుమారి ధృతి తమ పాటలతో అందరినీ ఎంతగానో అలరించారు. అనంతరం ఈసీ సభ్యులచేత చైర్మన్ రాజేందర్ రెడ్డి జిన్నా గారు బి ఓ డి & అడ్వైజరీ కమిటీ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు.
బి ఓ డి ఉపచైర్మన్ లక్ష్మణ్ రెడ్డి అనుగు గారు అతిథులను, హాజరైన సభ్యులను ఆహ్వానించి ఎన్నికైన వారిని సభకు పరిచయం చేసి ఆద్యంతo సభను ఉత్సాహభరితంగా నిర్వహించారు. సభ్యుల హర్షాధ్వానాల మధ్య NYTTA సంస్థ చైర్మన్ డా. రాజేందర్ రెడ్డి జిన్నా 2024 సంవత్సరానికి గాను NYTTA సంస్థకు నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.
అధ్యక్షురాలిగా వాణి సింగిరికొండ (Vani Singirikonda), ఉపాధ్యక్షురాలిగా పద్మ తాడూరి, సెక్రటరీగా రవీందర్ కోడెల, కోశాధికారిగా హరిచరణ్ బొబ్బిలి, జాయింట్ సెక్రటరీగా సౌమ్య శ్రీ చిత్తారి, జాయింట్ కోశాధికారిగా నరోత్తం రెడ్డి బీసం, సభ్యులుగా హారిక జంగం, సుధీర్ సువ్వ, శాలిని రెడ్డి మేకల మరియు హేమ వెంకట్ నియమితులయ్యారు
అధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత వాణి సింగిరికొండ గారు తన తొలి ప్రసంగం ఇచ్చారు. అనంతరం పలువురు ప్రముఖులు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అతిధులందరి కోసం రుచికరమైన వంటకాలు వడ్డించారు. తమ పాటలతో అందరినీ ఎంతగానో అలరించిన వేణు శ్రీరంగం మరియు ధృతిని నైటా కార్యవర్గ బృంద సభ్యులు ఘనంగా సత్కరించారు.
NYTTA బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సెక్రటరీ సతీష్ కాల్వ గారు 3వ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ “దావత్” కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ… కార్యవర్గ బృంద సభ్యులను మరియు అతిథులను కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.