ఎడిసన్, న్యూ జెర్సీ, సెప్టెంబర్ 7: అమెరికాలో హిందు ఆధ్యాత్మిక వైభవాన్ని కొనసాగిస్తున్న న్యూజెర్సీ సాయి దత్త పీఠం సాటి మనిషికి సాయపడాలనే సాయితత్వంతో పని చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రతి యేటా నిర్వహించే బ్యాక్ టూ స్కూల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా నిర్వహించింది. గత తొమ్మిది సంవత్సరాలుగా న్యూజెర్సీ సాయి దత్త పీఠం బ్యాక్ టూ స్కూల్ డ్రైవ్ నిర్వహిస్తుంది.
సాయి దత్త పీఠం, శ్రీ శివ, విష్ణు టెంపుల్ సభ్యులు నిర్వహించిన బ్యాక్ టూ స్కూల్ డ్రైవ్‌కి మంచి స్పందన లభించింది. న్యూజెర్సీ లోని సాయి దత్త పీఠం ఆ సాయి చూపిన చతుర్విద మార్గాలను తు.చ. తప్పకుండా పాటిస్తుంది. నిత్య అన్నదానం, సత్సంగ్, వితరణ, విద్య ఈ నాలుగింటిని తన ప్రధాన బాధ్యతలుగా భావిస్తున్న సాయి దత్త పీఠం బ్యాక్ టూ స్కూల్ డ్రైవ్ ద్వారా పేద పిల్లలకు స్కూలు బ్యాగులు, పుస్తకాలు, పెన్సిళ్లు ఉచితంగా అందించే కార్యక్రమాన్ని చేపట్టిందని సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచి తెలిపారు.
శ్రీధర్ గార్గ్, దిశా గార్గ్ అనే ఇద్దరు విద్యార్ధులు ఈ బ్యాక్ టూ స్కూల్ డ్రైవ్ విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. స్థానిక సంఘ సేవకురాలు, సాయి దత్త పీఠం డైరెక్టర్ శుభ పాటిబండ్ల ఆధ్వర్యంలో సాయిదత్త పీఠం బ్యాక్ టూ స్కూల్ డ్రైవ్‌తో పాటు ఉచిత వైద్య శిబిరాలు, ఫుడ్ డ్రైవ్, క్లాత్ డ్రైవ్ ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించింది. సాయి దత్త పీఠం ఏ కార్యక్రమం చేపట్టిన తక్షణమే స్పందిస్తున్న ప్రతి ఒక్కరికి రఘు శర్మ శంకరమంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో న్యూ జెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ కమిషనర్ ఎమిరేటస్ ఉపేంద్ర చివుకుల మాట్లాడుతూ.. మానవ సేవే మాధవ సేవ అని అందరూ ఇలాంటి డ్రైవ్స్ కు తమవంతు సాయం అందించాలన్నారు. “యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాను ‘అవకాశాల భూమి’ అని పిలుస్తారు ఎందుకంటే మనం మన పిల్లలకు విజయం సాధించడానికి అవకాశం ఇస్తాము మరియు ఆ అవకాశంలో ముఖ్యమైన భాగం విద్య అందుకే యువత కు మద్దతు ఇవ్వడం అతి ముఖ్యమైన పని, ”అని న్యూ జెర్సీ సెనెటర్ డిగ్నాన్ అన్నారు.
ఈ సందర్భంగా శుభ పాటిపండ్ల ను అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరింతగా విస్తరించాలన్నారు. ఎడిసన్ టౌన్‌షిప్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సభ్యుడు బిరల్ పటేల్ మాట్లాడుతూ.. సాయి దత్త పీఠం యొక్క భారీ మొత్తంలో వచ్చిన ఈ విరాళాల ద్వారా విద్యార్థుల ముఖాల్లో చిరునవ్వు నింపినందుకు ఉదార దాతలకు ధన్యవాదాలు తెలిపారు. పాఠశాల సరఫరా డ్రైవ్ విద్యార్థులకు తమ మద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా సెనెటర్ కార్యాలయం నుండి గ్రేగ్, ప్రిన్సిపల్ సిండీ టుఫారో కూడా పాల్గొన్నారు.