జార్జియా రాష్ట్రం, అట్లాంటా మహానగరంలో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి చెందిన నెల్లూరు (Nellore) ఎన్నారైలు కుటుంబసమేతంగా సమావేశమయ్యారు. విజయవంతంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 50 కుటుంబాలకు పైగా పాల్గొన్నారు.
వెంకట్ దుగ్గిరెడ్డి, సాయిరాం కారుమంచి, వినయ్ మద్దినేని మరియు జయకిరణ్ పగడాల ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. కుల, మత, ప్రాంతాలకతీతంగా భిన్నత్వంలో ఏకత్వంలా పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ కుటుంబసమేతంగా హాజరయ్యారు.
షారన్ స్ప్రింగ్స్ పార్క్ కమ్యూనిటీ హాల్ ఈ కార్యక్రమానికి వేదిక అయ్యింది. ఆటలు, పాటలు, డాన్సులతో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. వయసుతో సంబంధం లేకుండా ఎవరికివారు సరదాగా నెల్లూరు (Nellore) కు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
ఆగష్టు 20, ఆదివారం రోజున నిర్వహించిన ఈ నెల్లూరు ఎన్నారైల సమ్మేళనంలో ప్రత్యేకంగా నిర్వహించిన గేమ్స్ లో విజేతలకు గిఫ్ట్ కార్డ్స్ అందించారు. అందరినీ కలుపుకొనిపోతూ రోజంతా సందడి సందడి గా గడిపి, నెల్లూరు ప్రత్యేక వంటకాలతో విందు ఆరగించారు.
చాలా కాలం తర్వాత ఇలా నవ్వుకుంటూ ఉల్లాసంగా గడపడం, అలాగే తోటి నెల్లూరు వాసులను అట్లాంటాలో (Atlanta) కలుసుకోవడం ఆనందంగా ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. మును ముందు కూడా ఇలాంటి వినోదాత్మక సమ్మేళనాలను మరిన్ని నిర్వహించాలని కోరారు.