Connect with us

Literary

TANTEX @ Dallas: సాహితీ ప్రియుల మన్ననలను అందుకున్న సాహిత్య సదస్సు

Published

on

జులై నెల, 21 వ తేదీ ఆదివారము జరిగిన డల్లాస్ (Dallas) ఫోర్ట్ వర్త్, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం, టాంటెక్స్ ”నెల నెలా తెలుగు వెన్నెల”, తెలుగు సాహిత్య వేదిక 204 వ సాహిత్య సదస్సులో ”కవిత్వ సృజన – నా అనుభవాలు” అంశంపై ప్రముఖ కవి, విమర్శకులు శ్రీ దర్భశయనం శ్రీనివాసాచార్య వారు ముఖ్య అతిథి గా నిర్వహించిన సదస్సు చాలా బాగా జరిగింది. అంతర్జాలములో పలువురు సాహితీప్రియులు పాల్గొనడం ద్వారా జరిగిన ”నెలనెలా తెలుగు వెన్నెల”, తెలుగు సాహిత్య వేదిక ప్రారంభ సూచికగా ”గజాననమ్ తం గణేశ్వరం భజామి.. ” అంటూ భక్తి కీర్తనను చిరంజీవి సమన్విత రాగయుక్తంగానూ, వీనుల విందుగాను పాడి సాహితీ ప్రియులను భక్తి పారవశ్యులను చేసింది.

తన మధుర కంఠంతో కార్యక్రమ ప్రారంభాన్ని శోభాయమానం చేసిన చిరంజీవి సమన్విత ను పలువురు సాహితీ ప్రియులు అభినందించడం జరిగింది. టాంటెక్స్ (Telugu Association of North Texas) బోర్డు ఆఫ్ ట్రస్టీస్ మెంబర్, కార్యక్రమాల సలహాదారు మరియు సమన్వయ కర్త , శ్రీ దయాకర్ మాడా గారు నేటి సాహితీ సదస్సు అంతర్జాల ప్రసార ఏర్పాట్లను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు. తొలుత విశ్రాంత ఉపాధ్యాయురాలు శ్రీమతి సత్యవతి కావూరి గారు తెలుగు ఉపాధ్యాయినిగా తాను పనిచేసిన ప్రతి చోటా చిన్న చిన్న పదాలతో పద్యాలను, గీతాలను వ్రాసి స్కూలు పిల్లలతో నాటికలు వేయించడం, వారితో పాడించడం ద్వారా వారికి తెలుగు వ్యాకరణం పట్ల ఆసక్తిని రేకెత్తించిన విధానాన్ని సవివరంగా తెలియచేశారు.

మంచి అధ్యాపకులున్న చోట విద్యార్థులు గొప్ప పౌరులుగా తీర్చిదిద్దబడతారనీ, తన వద్ద చదువుకొన్న అనేకమంది ఎంత గొప్ప పదవులలో వున్నా తనను గుర్తుపెట్టుకొని పలకరించడం తనకు ఎంతో సంతోషాన్నితృప్తినీ మిగిల్చిందని శ్రీమతి సత్యవతి గారు పేర్కొన్నారు. శ్రీమతి సత్యవతి గారి ఉపన్యాసం విని అనేకమంది సాహితీ ప్రియులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తడం జరిగింది. ప్రాచీన కవులు వ్రాసిన తెలుగు పద్య రత్నాల్ని విద్యార్థులకు నేర్పించి వారిచే వినసొంపుగా, రాగయుక్తంగా పాడించడంలో ఎనలేని ప్రావీణ్యత గల శ్రీ రమణ దొడ్ల గారు చిరంజీవి సాకేత్ పొట్లతో జరిపిన ”పిండంతే నిప్పటి” సంభాషణ బహుజనరంజకంగా సాగింది.

పోతన భాగవతము లోని భక్తిరసాత్మకమైన పద్యాలను వారిద్దరూ అద్భుతంగా పాడడంతోపాటు, ప్రార్ధన, ధ్యానము, సమాధి, ఆత్మ నియంత్రణ మొదలైనవి, గురు శిష్యుల సంభాషణలో ప్రస్తావనకు రావడంతో సాహితీ ప్రియులు అత్యంత ఆసక్తితో ఆలకించడం జరిగింది. ఈ సంభాషణానంతరం శ్రీ రమణ దొడ్ల గారినీ, చిరంజీవి సాకేత్ పొట్లనూ అంతా మెచ్చుకోవడం జరిగింది. తరువాత సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ నరసింహా రెడ్డి ఊరిమిండి గత 75 మాసాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న ”మన తెలుగు సిరి సంపదలు” అందరినీ ఆకట్టుకున్నది. కార్యక్రమంలో అందరినీ భాగస్వాములను చెయ్యాలనే శుభ సంకల్పంతో ప్రారంభించిన ధారావాహిక శీర్షిక ”మన తెలుగు సిరి సంపదలు”.

చమత్కార గర్భిత పొడుపు పద్యాలు, ప్రహేళికలు,జాతీయాలు, పొడుపు కథలతో సహా దాదాపు యాభై ప్రక్రియల సమాహారమే ఈ శీర్షిక ప్రత్యేకత. స్థానిక, ప్రాంతీయ, జాతీయ స్థాయిలో ప్రజాదరణ పొందిన, పొందుతున్న ఈ శీర్షికలో వైవిధ్య భరితమైన తెలుగు భాషా ప్రయోగాలను స్పృశించడం డాక్టర్ నరసింహా రెడ్డి ఊరిమిండి వారి మరొక ప్రత్యేకత. సంఖ్యా ప్రకరణముతో పాటు, 4 అక్షరాల పద భ్రమకాలు, 5 అక్షరాల పదభ్రమకాలు మరియు 6 అక్షరాల పద భ్రమకాలు కొంటె ప్రశ్నలుగా సంధించి సాహితీ ప్రియుల నుండి సమాధానాలను రాబట్టడంలో విజయవంతమైన డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి వారిని పలువురు ప్రశంసించడం జరిగింది.

అనంతరం ”తెలుగు సాహిత్యంలో వైజ్ఞానిక అంశాలు” అన్న శీర్షిక క్రింద ఆయా సుప్రసిద్ధ సాహిత్యకారులు వైజ్ఞానిక అంశాల్నిఉపయోగిస్తూ తమ కవిత్వంలో ఎలా అన్వయించు కొన్నారో, ఎలా ప్రభావితం చేశారు అనే విషయాల్ని లోతుగా పరిశీలించారు ప్రముఖ సాహితీ విమర్శకులు శ్రీ లెనిన్ వేముల గారు. ప్రముఖ కవి దాశరధి కృష్ణమాచార్య శతజయంతి సంవత్సరం నేటినుండి మొదలవుతున్న సందర్భంగా ఆమహనీయుని గుర్తుచేసుకొంటూ ఆ మహాకవి రచనా శైలి యందలి వైశిష్ట్యాన్ని అద్భుతంగా వివరించారు శ్రీ లెనిన్ వేముల గారు.

తరువాత నేటి ముఖ్య అతిథి, ప్రముఖ కవి, విమర్శకులు, అనువాదకులు మరియు సంపాదకులు శ్రీ దర్భశయనం శ్రీనివాసాచార్య గారిని సంస్థ సమన్వయకర్త శ్రీ దయాకర్ మాడా గారు సభకుపరిచయం చేయడంజరిగింది. శ్రీ శ్రీనివాసాచార్య గారు మాట్లాడుతూ. చదువుకొనే రోజుల్లో స్కూలు లైబ్రరీలో పుస్తకాలను అదేపనిగా చదివేవాడిననీ, 13 ఏళ్ళ వయసులో నే కవిత వ్రాశాననీ తెలిపారు. తనకు చదువు చెప్పిన టీచరు శ్రీ లక్ష్మీనారాయణ గారు సహజంగా కవి కావటంతో వ్యవసాయ కుటుంబము నుండి వచ్చిన తాను, అదేవృత్తిని నమ్ముకొని శ్రమిస్తున్న రైతుల కష్టాలను పునాదిగా చేసుకొని 17 ఏళ్ళ వయసులో మరిన్ని కవితలు వ్రాయడంతో పాటు ఆంగ్లానువాదాన్నికూడా వంట పట్టించుకోవడం జరిగిందని తెలిపారు.

తన అమ్మమ్మ గారి ఊరిలో చదువుకొనే సమయంలో నిత్యా కవితా వతంసుడైన కవితా శరధి, దాశరధి నడచిన ఊరిలో తానూ నడుస్తున్నానే అనుభూతికి లోనయ్యేవాడిననీ ఆరోజుల్ని తలచుకొంటూ ఉద్వేగభరితులయ్యారు శ్రీ శ్రీనివాసాచార్య గారు. ఆదికవి నన్నయ చెప్పిన ట్లు కవిత్వమనేది ‘జగత్ విహితం’ గా ఉండాలనే దృక్పథంతో తాను చిన్నతనం నుండీ ఇప్పటివరకు కవితాసాహితీ వ్యవసాయాన్నికొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ శాస్త్రంలో స్నాతకోత్తరపట్టాలు పొందడంతో ఆంధ్రా బ్యాoకులో ఉన్నత ఉద్యోగము చేసే అవకాశం వచ్చిందనీ, అయితే ఉద్యోగ రీత్యా కలకత్తా,ఒడిశా లతో పాటు మరిన్ని ప్రదేశాలను సందర్శించే సమయంలో తాననుభవించిన భావోద్వేగాలను అప్పటికప్పుడే కవితలుగా వ్రాయడం అలవాటు చేసికొన్నట్లు చెప్పారు.

విద్యార్థుల ఆత్మహత్యలు, అలాగే ఆరుగాలం కష్టపడి పండించినప్పటికీ ప్రకృతి వైపరీత్యాలతో పంటనష్టం భరించలేని రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం చూసి చలించిపోయిన తాను వారికి మనో స్థైర్యం కలిగించే కవితలు వ్రాసి సమాజానికి ఎంతో కొంత తోడ్పడిన వైనాన్ని అద్భుతంగా వివరించారు. అనేక కవితలు పుస్తక రూపంలో వెలువడినట్లు తెలిపిన వీరు సాహిత్యమంటే కృతజ్ఞతల సంపుటిగా భావిస్తానని అన్నారు. పూర్వం తాను మట్టి మీద వ్రాసిన కవిత, మిజోరాం లో తాను పోగొట్టుకొన్న ఉంగరం మీద వ్రాసిన కవిత, ఇటీవల నయాగరా జలపాతమును దర్శించిన సమయంలో వ్రాసిన కవిత వంటి కొన్నివిశేష పద కవితలు చదివి వినిపించారు. వాస్తవితకు అద్దం పడుతున్న వారి స్వీయ కవితలు సాహితీ ప్రియుల మనసులను రంజింప చేశాయనడంలో సందేహం లేదు. ‘ఇచ్చిన దానికంటే సాహిత్యం నుండి నేను స్వీకరించిందే ఎక్కువ’అని బలంగా నమ్మే వీరి ప్రసంగం ఆద్యంతం ఆసక్తి దాయకంగా సాగింది.

టాంటెక్స్ (TANTEX) సంస్థ పూర్వాధ్యక్షులు, డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి వారు, శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారు, శ్రీ చిన సత్యం వీర్నాపు గారు, ప్రముఖ సాహితీ ప్రియులు ఆచార్య గంగిశెట్టి లక్ష్మీ నారాయణ గారు, శ్రీ లెనిన్ వేముల గారు, శ్రీమతి సత్యవతి కావూరి గారు, శ్రీ దయాకర్ మాడా గారు, శ్రీ లలితానంద ప్రసాద్ గారు, శ్రీ గోవర్ధనరావు నిడిగంటి మొదలైన సాహితీ ప్రియులనేకమంది శ్రీ దర్భశయనం శ్రీనివాసాచార్య గారి నోటి వెంట జాలువారిన వారి నాలుగు దశాబ్దాల సాహితీ ప్రస్థానాన్ని వేనోళ్ళ కొనియాడడం జరిగింది. ఆ తరువాత, ఉత్తర టెక్సాస్ తెలుగుసంఘం టాంటెక్స్ ప్రస్తుత అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు, సంస్థ పాలక మండలి, బోర్డు ఆఫ్ ట్రస్టీస్ మెంబర్, సంస్థ కార్యక్రమాల సలహాదారు డాక్టర్ దయాకర్ మాడా గారు, నేటి ముఖ్య అతిథి శ్రీ దర్భశయనం శ్రీనివాసాచార్య గారికి టాంటెక్స్ సంస్థ తరపున సమర్పించిన సన్మాన పత్ర జ్ఞాపిక ను చదివి వినిపించి ‘కవితా విశారద’ బిరుదుతో ఘనంగా సన్మానించడం జరిగింది.

సన్మాన గ్రహీత, ముఖ్య అతిథి శ్రీ దర్భశయనం శ్రీనివాసాచార్య గారు మాట్లాడుతూ.. అమెరికా దేశ సందర్శనకు వచ్చిన ఈ సమయంలో టాంటెక్స్ (Telugu Association of North Texas) ప్రస్తుత అధ్యక్షులు శ్రీ సతీష్ బండారుగారు, తనను, తను చేస్తున్న కవితా సాహిత్య వ్యవసాయాన్ని గుర్తించడం, అనేక మంది సాహితీ ప్రియులు పాల్గొన్న ఈ సదస్సులో తనను సన్మానించి ప్రోత్సహించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంతగా ఆదరించిన టాంటెక్స్ సాహితీ సభ్యులందరికీ శ్రీ శ్రీనివాసాచార్య గారు కృతజ్ఞతలు తెలిపారు.

టాంటెక్స్ (TANTEX) ప్రస్తుత అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు గారు, సంస్థ పూర్వాధ్యక్షులు, డాక్టర్ నరసింహా రెడ్డి ఊరిమిండి గారు, శ్రీ వీర్నాపు చిన్న సత్యం గారు, శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారు, శ్రీ లెనిన్ వేముల గారు గారు, సిరికొన సాహితీ అకాడమీ వ్యవ స్థాపకులు ఆచార్య గంగిశెట్టి లక్ష్మీ నారాయణ గారు, శ్రీ లెనిన్ వేముల గారు, ఇంకా శ్రీరమణ దొడ్ల గారు, శ్రీ రమేష్ గారు, శ్రీ బి.లలితానంద ప్రసాద్ గారు, శ్రీ జయదేవ్ మెట్టుపల్లి గారు, శ్రీ నగేష్ గారు, శ్రీ గోవర్ధనరావు నిడిగంటి వంటి సాహితీ ప్రియులు అనేకమంది అంతర్జాలంద్వారా హాజరవడంతో సదస్సు విజయవంతమైంది.

సాహితీ ప్రియుల మన్ననలను విశేషంగా అందుకొన్న ఈ సదస్సును విజయ వంతం చేసిన ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (Telugu Association of North Texas) ప్రస్తుత అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు (Satish Bandaru) గారు, సమన్వయ కర్త డాక్టర్ దయాకర్ మాడా గారు, సంస్థ పాలక మండలి మరియు అధికార కార్యవర్గ బృందం సభ్యులు అభినందనీయులు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected