రెంటపాళ్ల, గుంటూరు జిల్లా, జూలై 28: అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ .. తెలుగు నాట కూడా అనేక సేవా కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తోంది. ఈ క్రమంలోనే నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందడి ఉమ్మడి గుంటూరు జిల్లా (Guntur District) రెంటపాళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రతిభ గల పేద విద్యార్ధులకు అండగా నిలబడాలని నిశ్చయించుకున్నారు.
తను చదువుకున్న పాఠశాలకు నాట్స్ (North America Telugu Society – NATS) అధ్యక్షుడిగా రావడంతో విద్యార్ధులంతా శ్రీహరి మందడికి ఘన స్వాగతం పలికారు. చదువు ఒక్కటే జీవితాలను మార్చివేస్తుందని, చదువుపై దృష్టి నిలిపితే అత్యున్నత స్థాయికి ఎదగవచ్చని ఈ సందర్భంగా విద్యార్ధులకు సూచించారు.
రెంటపాళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్ధుల మధ్యాహ్నా భోజనానికి అవసరమైన ప్లేట్లు, గ్లాసులు అందిస్తానని శ్రీహరి మందడి (Srihari Mandadi) తెలిపారు. అలాగే ఈ పాఠశాలలో చదువుకునే ప్రతిభ గల విద్యార్ధులకు ఉపకారవేతనాలు (Scholarships) ఇస్తామని ప్రకటించారు.
గతంలో కూడా శ్రీహరి మందడి (Srihari Mandadi) ఈ పాఠశాలలో విద్యార్ధులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించారు. అమెరికాకు వెళ్లిన సొంత గ్రామాన్ని, తాను చదవిన పాఠశాలను మర్చిపోకుండా వాటి అభివృద్ధికి సాయం చేస్తున్న శ్రీహరి మందాడిని ఉపాధ్యాయులు, స్థానిక పెద్దలు సన్మానించారు.
శ్రీహరి మందడి (Srihari Mandadi) సొంత గ్రామం కోసం, తాను చదవిన బడి కోసం చేస్తున్న సాయాన్ని వారు కొనియాడారు. జన్మభూమి రుణం తీర్చుకోవడానికి శ్రీహరి మందడి చేస్తున్న కృషిని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) అభినందించారు.