Connect with us

Education

పన్నులు & రాయితీలపై స్పష్టత ఇచ్చిన అనిల్ గ్రంధి; NATS Webinar

Published

on

నాట్స్ (North America Telugu Society) తాజాగా ఆదాయపు పన్నుపై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. నాట్స్ హ్యూస్టన్ విభాగంలో ఆన్‌లైన్ ద్వారా నాట్స్ నిర్వహించిన ఈ ఆదాయపు పన్ను వెబినార్‌కు చక్కటి స్పందన లభించింది. ఫిబ్రవరి, మార్చి అనగానే అమెరికాలో ఉండే వారికి అనేక ఆర్థిక ప్రశ్నలు తలెత్తుతాయి.

పన్ను బకాయిలు చెల్లించడం ఎలా? పన్ను రాయితీలని పొందడం ఎలా? ఒకవేళ భారత దేశంలో ఏమైనా ఆస్తులు ఉంటే అవి నిధి రూపేణా అమెరికాకు తరలించడం ఎలా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కోసమే నాట్స్ (NATS) ఆదాయ పన్ను వెబినార్ నిర్వహించింది.

నాట్స్ సెంట్రల్ విభాగం ప్రోత్సాహంతో నాట్స్ హ్యూస్టన్ విభాగం నిర్వహించిన ఈ వెబినార్ ఒక్క తెలుగు వారికే కాక అమెరికాలో ఉన్న భారతీయులందరికీ ఉపయోగపడే చక్కటి కార్యక్రమమని వెబినార్‌లో పాల్గొన్న సాటి భారతీయులు ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ వెబినార్ లో ముఖ్య అతిధిగా ప్రఖ్యాత ఆదాయ, వృత్తి పనుల నిపుణులు, అనిల్ గ్రంధి (Anil Grandhi, AG FinTax) తన అమూల్య సూచనలు, సలహాలు తెలియజేశారు. ఎఫ్.ఎ.టి. సి.ఎ, విద్యుత్తు వాహనాలకు అమెరికా ప్రభుత్వం ప్రకటించిన పన్ను రాయితీలు, రోత్ ఆయారే భారత దేశం నుంచి బహుమతి రూపేణా నిధులని అమెరికా తీసుకువచ్చే మార్గాలు ఇలా ఎన్నో అంశాలపై సమగ్రంగా అనిల్ గ్రంథి వివరించారు.

దాదాపు రెండు గంటలపాటు చాలా ఓపికగా ప్రశ్నలు విని, శ్రోతలకు దిశానిర్దేశం చేసిన అనిల్ గ్రంధి అంకిత భావాన్ని నాట్స్ అధ్యక్షులు బాపయ్య చౌదరి (బాపు) నూతి, నాట్స్ బోర్డు చైర్ విమెన్ అరుణ గంటి కొనియాడారు. ఈ కార్యక్రమానికి నాట్స్ హ్యూస్టన్ మహిళా విభాగ సమన్వయకర్త, సత్య దీవెన వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో నాట్స్ (NATS) బోర్డు సభ్యులు, సునీల్ పాలేరు, సహా కోశాధికారి హేమంత్ కొల్ల, హ్యూస్టన్ విభాగ సభ్యులు శ్రీనివాస్ కాకుమాను, వీరు కంకటాల, శైలజ గ్రంధి, విజయ్ దొంతరాజు, చంద్ర తెర్లి, ఆదిత్య దామెర, వంశి తాతినేని తదితరులు పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected