డల్లాస్ తెలుగు వేడుకలు, మన ఇంటి వేడుకలు అందరూ ఆహ్వానితులే ఇక ఆలస్యమెందుకు!
పసందైన భోజనం, ఘనమైన కళా వైభవం సుమధుర సంగీతం, అధ్బుతమైన నాట్య నైపుణ్యం
సినీతారల తళుకులు, వైవిధ్యమైన విక్రయ కేంద్రాలు హాస్య నటుల గుళికలు, చిన్నారుల కళా ప్రదర్శనలు
నటకిరీటి చమక్కులు, అందాల అంజలి హొయలు కార్తీక్ బృందం చే గాన కచేరీ శ్రుతి లయలు
అలరించటానికి నాట్స్ డల్లాస్ తెలుగు వేడుకలు సిద్ధం ఆత్మీయమైన ఆతిథ్యం, పలుకుతోంది స్వాగతం
తెలుగువారందరికీ ఇదే మా ఆహ్వానం డల్లాస్ వేడుకలు, తెలుగుదనానికి సంతకం
డల్లాస్ (Dallas) లో మార్చి 15, 16 తేదీల్లో అలెన్ ఈవెంట్ సెంటర్ (Credit Union of Texas Event Center) వేదికగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తెలుగు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. యువతను భాగస్వామ్యం చేస్తున్న ఈ వేడుకల ద్వారా వచ్చే నిధులను తెలుగు రాష్ట్రాల్లో సామాజిక సేవా కార్యక్రమాలకు వెచ్చించనున్నారు.
నాట్స్ తెలుగు వేడుకలతో పాటు మార్చి 15న జరిగే బోర్డు సమావేశం కోసం కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు, మహిళా సాధికారత (Women Empowerment) కార్యక్రమాలు, వ్యాపార చర్చలు, సాహిత్య కార్యక్రమాలు వంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు ఈ తెలుగువేడుకల్లో ఉన్నాయి. స్థానిక తెలుగు విద్యార్థుల అద్భుత ప్రదర్శనలు, కళాశాల విద్యార్థుల ప్రత్యేక నృత్యాలు ఇలా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ఈ వేడుకలలో ఉంటాయి.
యువతకు సరదా, కుటుంబాలకు కలయిక, సీనియర్లకు గౌరవం.. ఇలా అన్ని వయసుల వారిని ఆకట్టుకునేలా కార్యక్రమాలు డల్లాస్ తెలుగు వేడుకల్లో అందరిని అలరించనున్నాయి. ఈ తెలుగు వేడుకలకు అందరికి ప్రవేశం పూర్తిగా ఉచితం. భారతదేశం (India) నుండి విశిష్ట అతిథులు, కళాకారులు, సామాజిక సేవకులు… ఇలా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు డల్లాస్ తెలుగు (Telugu) వేడుకలకు హాజరు కానున్నారు.
తెలుగు ప్రముఖులతో మాట్లాడే అవకాశం, విజ్ఞానం పంచుకునే అవకాశం ఉన్న ఈ నాట్స్ తెలుగు వేడుకలలో డల్లాస్ తో పాటు అమెరికాలో ఉండే తెలుగువారంతా పాలుపంచుకోవచ్చని, అరుదైన ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నాట్స్ అధ్యక్షులు బాపయ్య చౌదరి (బాపు) నూతి మరియు నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని సారధ్యంలోని నాట్స్ నాయకులు కోరారు.