ఎడిసన్, న్యూ జెర్సీ, అక్టోబర్ 11: అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే ‘నాట్స్’ అమెరికా తెలుగు సంబరాల్లో సేవా సంస్థలకు ఇచ్చిన మాటను నాట్స్ నిలబెట్టుకుంది. సంబరంలో సేవ.. సంబరంతో సేవ అనే నినాదంతో నాట్స్ మే నెలలో అమెరికా తెలుగు సంబరాలను ఘనంగా నిర్వహించింది.
ఈ సంబరాల (Convention) ద్వారా వచ్చిన మొత్తంలో 25 శాతాన్ని సేవా సంస్థలకు ఇస్తామని సంబరాల వేదికగా ప్రకటించింది. ఇచ్చిన మాట ప్రకారం నాట్స్ (North America Telugu Society) తాజాగా లక్షా నలభై వేల డాలర్లను న్యూజెర్సీలో జరిగిన తెలుగు కళా సమితి 40వ వార్షికోత్సవంలో నాట్స్ నాలుగు సేవా సంస్థలకు విరాళంగా అందించింది.
నాట్స్ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించిన సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీధర్ అప్పసాని ని నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి ప్రశంసించారు. నాట్స్ పిలుపుకు స్పందించి సంబరాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీధర్ అప్పసాని, కో కన్వీనర్ రాజ్ అల్లాడ లను ప్రత్యేకంగా అభినందించారు.
అడిగితే చేసేది సాయం.. అడగకుండా చేసేది సేవ అని.. అలాంటి సేవను సంబరాల్లో సమ్మిళితం చేసి సంబరాలను నిర్వహించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని శ్రీధర్ అప్పసాని (Sreedhar Appasani) అన్నారు. సంబరాల్లో పని చేసిన ప్రతి ఒక్కరికి శ్రీధర్ అప్పసాని అభినందనలు తెలిపారు.
గతంలో సంబరాలకు 1.5 మిలియన్ డాలర్లు విరాళంగా వచ్చేవని, ఈ సారి అవి 2.6 మిలియన్ డాలర్లకు చేరడం సమిష్టి కృషి వల్లే సాధ్యమైందని తెలిపారు. సంబరాలకు సీఎక్స్‌ఓ ఫోరం క్రియేటివ్ కన్సల్టెంట్‌గా పనిచేసిన శ్రీ అట్లూరి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
నాట్స్ సంబరాల వేదికపై నారాయణ మూర్తి (Infosys) జంటకు జీవిత సాఫల్య పురస్కారం ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. సంబరాలకు విరాళాలు ఇచ్చిన వారిని ఈ ఈవెంట్‌లో నాట్స్ సత్కరించింది. నాట్స్ పై ఉన్న నమ్మకంపై స్పందించి సంబరాలకు భారీ విరాళాలు ఇచ్చిన దాతలను నాట్స్ నాయకుడు శ్యామ్ మద్ధాళి ప్రత్యేకంగా అభినందించారు.
సంబరాల్లో ఇచ్చిన మాట ప్రకారం వికలాంగులకు అండగా నిలుస్తున్న హోప్ 4 స్పందన కు 50 వేల డాలర్లు, మానసిక వికలాంగులు, ఆటిజం బాధితులకు సాయం చేస్తున్న కేడీబీ ట్రస్ట్‌కి 20 వేల డాలర్లు, పేదల కంటి సమస్యలకు పరిష్కారం చూపుతున్న ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికాకు 50 వేల డాలర్లు, పేద మహిళా రైతులకు సాయం చేసే ఎయిడ్ ఇండియాకు 20 వేల డాలర్లు అందించారు.
నాట్స్ (North America Telugu Society) తమపై నమ్మకం ఉంచి ఇచ్చిన ప్రతి డాలర్‌ను సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని సేవా సంస్థల ప్రతినిధులు తెలిపారు. సంబరాలతో సేవ చేయడమనే వినూత్నమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టిన నాట్స్ పై వారు ప్రశంసల వర్షం కురిపించారు.
నాట్స్ (NATS) తో కలిసి పనిచేస్తున్న తెలుగు కళాసమితికి నాట్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. తెలుగు కళా సమితి (TFAS) అధ్యక్షులు మధు రాచకుళ్ళ తోపాటు తెలుగు కళా సమితి (Telugu Fine Arts Society) బోర్డు సభ్యులను నాట్స్ ఈ సందర్భంగా అభినందించింది.
నాట్స్ (NATS) సంబరాల కోసం విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి నాట్స్ అధ్యక్షులు బాపయ్య చౌదరి (బాపు) నూతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ఈవెంట్‌లో స.రి.గ.మ.ప. లిటిల్ చాంప్స్ గాయని చిన్నారి వాగ్థేవి తన పాటల ప్రవాహంతో అందరని మంత్రముగ్థులను చేసింది.