నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) అధ్యక్షులు బాపయ్య చౌదరి తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా సేవలు చేసేందుకు నాట్స్ ముందుకు వస్తున్నదని తెలిపారు. శుక్రవారం జూన్ 23న స్థానిక అనంతపురం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నార్త్ అమెరికా తెలుగు సొసైటీ 2009 లో ఏర్పాటు అయిందని తెలిపారు. అప్పటినుండి తెలుగువారి సంక్షేమమే ధ్యేయంగా తెలుగు భాష పరిరక్షణ లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగా అనంతపురం జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (RDT) తో కలిపి సంయుక్తంగా పలు కార్యక్రమాలు చేసేందుకు రూపకల్పన చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అందులో భాగంగా RDT డైరెక్టర్ మాంచు ఫెర్రార్ తో చర్చించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణాభివృద్ధి (విలేజి డెవలప్మెంట్) కార్యక్రమాలు లక్ష్యంగా “మన గ్రామం-మన బాధ్యత” అనే నినాదంతో కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అమెరికాలోని తెలుగువారి సంరక్షణ కోసం 24 గంటల పాటు అందుబాటులో ఉండే విధంగా 1-888-4-TELUGU టోల్ ఫ్రీ నెంబర్ 24×7 అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పలు ఉచిత వైద్య శిబిరాలు (ఐ క్యాంపులు), విద్యార్థులకు ప్రోత్సాహక స్కాలర్షిప్ బహుమతులు, ఉన్నత విద్య కోసం చేయూత వంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె నాగేశ్వరరావు, సుబ్బారావు నారాయణరెడ్డి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.