అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా ఇటు తెలుగునాట కూడా ప్రతిభ గల విద్యార్ధులను ప్రోత్సాహిస్తోంది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆర్ట్ అండ్ సైన్స్ కళశాలలోని ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్ధులకు ఉపకార వేతనాలు (స్కాలర్షిప్స్) అందించింది.
పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళశాలలో జరిగిన 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యార్ధులకు ఈ ఉపకార వేతనాలను అందించడం జరిగింది. నాట్స్ అధ్యక్షులు బాపయ్య (బాపు) చౌదరి నూతి సహకారంతో ఈ ఉపకారవేతనాలను విద్యార్ధులకు బాపయ్య చౌదరి మిత్ర మండలి సభ్యులు కాకుమాను నాగేశ్వరరావు, నూతి సుబ్బారావు, దాసరి సుబ్బారావు, మిన్నెకంటి లక్ష్మీనారాయణలు ఉపకారవేతనాలు పంపిణీ చేశారు.
డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వెంకట అనూష, కె. దత్తు శ్రీ నాగసాయి, పి.నాగరాజు 90% నుండి 96% మార్కులు సాధించిన ముగ్గురుతో పాటు ఇంటర్ లో 92% మార్కులు సాధించిన ఇద్దరికి 10వేల రూపాయల చొప్పున ఉపకార వేతనాలు అందించారు. బాపయ్య చౌదరి అమ్మ గారు నూతి సీతాదేవి పేరుతో వీటిని విద్యార్ధులకు అందించారు.
ప్రభుత్వ కళాశాలలో అత్యంత పేద విద్యార్థులే చదువుతున్నారని వారిని ప్రోత్సహించడం సంతోషంగా ఉందని బాపయ్య చౌదరి మిత్రమండలి తెలిపింది. పాఠశాలలో తగిన వనరులు లేకపోయినా విద్యార్ధులు 96% మార్కులు సాధించడం అభినందనీయం అని పేర్కొంది.
విజ్ఞాన్ రత్తయ్య, రిటైర్డ్ ఏఎస్‌పీ, పెదనందిపాడు ఎడ్యుకేషనల్ సోసైటీ సెక్రటరీ శ్రీకాళహస్తి సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంత చక్కటి కార్యక్రమానికి మద్దతు అందించిన నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి కి బాపు నూతి ధన్యవాదాలు తెలిపారు.