అంతర్జాలం, నవంబర్ 27, 2023: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేశ్‌తో ఇష్టా గోష్టి కార్యక్రమం నిర్వహించింది. నాట్స్ (NATS) తెలుగు లలితా కళా వేదిక ప్రతి నెల తెలుగు కళా రంగాలకు చెందిన ప్రముఖులతో చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది.
దీనిలో భాగంగానే తాజాగా మాధవపెద్ది సురేశ్ (Madhavapeddi Suresh) తో ఆన్‌లైన్ వేదికగా నిర్వహించిన “మధురమే సుధాగానం” కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. తన సంగీత ప్రయాణం ఎలా ప్రారంభమైంది? ఆనాటి సంగీత దర్శకులు, దర్శకులతో తనకున్న అనుభవాలను మాధవపెద్ది సురేశ్ గారు ఈ నాట్స్ (North America Telugu Society) కార్యక్రమంలో వివరించారు.
భైరవద్వీపం (Bhairava Dweepam) సినిమాలో తన పాటల విజయం వెనుక ఉన్న అనేక ఆసక్తికర విషయాలను ఈ సందర్భంగా వెల్లడించారు. తెలుగు సినీ సంగీతంలో శాస్త్రీయ సంగీతం పోషించిన పాత్రను కూడా మాధవపెద్ది వివరించారు. ఏ పాటైనా వినటానికి వినసొంపుగా ఉండటంతో చక్కటి సాహిత్యం ఉంటే ఆ పాట పది కాలాల పాటు నిలిచిపోతుందని తెలిపారు.
ఆద్యంతం ఎంతో ఆసక్తిగా, ఆహ్లాదకరంగా సాగిన ఈ కార్యక్రమానికి శాయి ప్రభాకర్ యఱ్ఱాప్రగడ, గిరి కంభంమెట్టు, మురళీకృష్ణ మేడిచెర్ల వ్యాఖ్యతలుగా వ్యవహరించారు. నాట్స్ తెలుగు కళలు, సంస్కృతి పరిరక్షణకు చేస్తున్న కృషిని, నాట్స్ హెల్ప్ లైన్ 1-888-4-TELUGU ద్వారా చేస్తున్న సేవలను నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి (Bapu Nuthi) నూతి వివరించారు.
అంతేకాక, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటానికి కృషిచేసిన లలిత కళా వేదిక కోర్ సభ్యులు కిశోర్ భరద్వాజ్ (కిభశ్రీ), సాయి ఎఱ్ఱాప్రగడ గారు, మురళి మేడిచెర్ల, గిరి కంభంమెట్టుతో పాటు ఇతర సభ్యుల చొరవను కొనియాడారు. నాట్స్ ఆహ్వానించగానే వచ్చి అలనాటి సంగీత మాధుర్యం గొప్పతనాన్ని వివరించిన మాధవపెద్ది సురేశ్‌కు నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి ప్రత్యేక అభినందనలు తెలిపారు.