అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా ఫిలడెల్ఫియా (Philadelphia) లో చేపట్టిన ఫుడ్ డ్రైవ్‌కు మంచి స్పందన లభించింది. విద్యార్ధుల్లో సేవా భావాన్ని పెంచడంతో పాటు సాటి వారికి సాయం అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ఫుడ్ డ్రైవ్‌ను విద్యార్ధులు ముందుండి నడిపించారు.
స్థానిక ది హిల్ స్కూల్ విద్యార్థి కాగితపు అఖిల్ దీనికి నేతృత్వం వహించాడు. నాట్స్ నాయకులతో కలిసి అఖిల్ అతని సహచర విద్యార్ధులు ఆగష్టు 19న నిర్వహించిన ఈ ఫుడ్ డ్రైవ్‌కి చక్కటి స్పందన లభించింది. నాట్స్ ఫుడ్ డ్రైవ్ ద్వారా సేకరించిన ఆహారపదార్థాలతో పాటు 5000 డాలర్లను పెన్విలినియాలోని చెస్టర్ కౌంటీ ఫుడ్ బ్యాంక్ (Chester County Food Bank) కు అందించడం జరిగింది.
నాట్స్ (North America Telugu Society) సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్న చెస్టర్ కౌంటీ ఫుడ్ బ్యాంక్ ప్రతినిధులు నాట్స్ పై ప్రశంసల వర్షం కురిపించారు. విద్యార్ధుల్లో చిన్ననాటి నుంచే సేవ భావాన్ని పెంచేందుకు నాట్స్ చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు.
నాట్స్ అందిస్తున్న సాయం పేదల ఆకలి తీర్చేందుకు దోహదపడుతుందని తెలిపారు. నాట్స్ (NATS) ప్రతియేటా అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి ఫుడ్ డ్రైవ్‌లు నిర్వహించి అన్నార్తుల ఆకలి తీర్చేందుకు ప్రయత్నిస్తోంది.