Connect with us

Devotional

కాణిపాకం వరసిద్ధి వినాయకునికి NATS Convention తొలి ఆహ్వాన పత్రిక

Published

on

అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే  నాట్స్ (North America Telugu Society – NATS) అమెరికా తెలుగు సంబరాలు ఈసారి టాంపా (Tampa) వేదికగా జరగనున్నాయి. ఈ సంబరాల (Convention) తొలి ఆహ్వాన పత్రికను నాట్స్ నాయకులు కాణిపాకం (Kanipakam, Chittoor) విఘ్నేశ్వరుడికి అందించారు.

జులై 4,5,6 తేదీల్లో జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు నిర్విఘ్నంగా, దిగ్విజయంగా జరిగేలా కోరుకుంటూ కాణిపాకం విఘ్నేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమెరికాలో ప్రతి రెండేళ్లకు జరిగే అతి పెద్ద తెలుగు పండుగ నాట్స్ అమెరికా తెలుగు సంబరాలని సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ (Srinivas Guthikonda) అన్నారు.

ఈ సంబరాలకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండేందుకు కాణిపాకం (Kanipakam) విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం పొందేందుకు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశామని ఆయన తెలిపారు. శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుడికి ఇచ్చిన ఆహ్వాన పత్రికతోనే సంబరాలకు  శ్రీకారం చుట్టామని నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది (Srinivasa Malladi) తెలిపారు.

వరసిద్ధి వినాయకుడి ఆశీస్సులతో టాంపా (Tampa, Florida) లో సంబరాలను దిగ్విజయంగా నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాట్లను ముమ్మరం చేయనున్నామని మల్లాది తెలిపారు. ఏ శుభకార్యమైనా తొలి ఆహ్వాన ప్రతికను విఘ్నేశ్వరుడికే అందించే మన తెలుగు సంప్రదాయాన్ని సంబరాల కోసం కూడా పాటించామని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) అన్నారు.

తెలుగు సంప్రదాయాలు, సాహిత్య, కళా వైభవాలకు అమెరికా తెలుగు సంబరాలు వేదికగా నిలుస్తాయని ఆయన తెలిపారు. అమెరికాలో ఉండే తెలుగు వారంతా టాంపా (Tampa, Florida) లో జరిగే సంబరాలకు తరలిరావాలని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి (Madan Pamulapati) పిలుపునిచ్చారు.

అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి వచ్చే అరుదైన అవకాశాన్ని అమెరికాలో ఉండే తెలుగు కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి (Srihari Mandadi) కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు నాట్స్ నాయకులు పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected