అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా న్యూజెర్సీ (New Jersey) లో ప్రజల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించింది. న్యూజెర్సీ లోని వారెన్ (Warren, New Jersey) పట్టణ పోలీసు అధికారి డిటెక్టివ్ సార్జంట్ జోసెఫ్ కోహెన్ ఈ సదస్సులో అవగాహన కల్పించారు.
ఈ అవగాహన సదస్సులో దొంగతనాలు, దోపిడిలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు ఎలా తీసుకోవాలి? క్రిమినల్స్ ఎలాంటి ఇళ్లపై కన్నేస్తారు? సెలవులపై వెళ్లేటప్పుడు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టాలి? ఎలాంటివి పెట్టకూడదు? ఇంటి ఆవరణలో ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాట్లు ఉండాలి? ఒక వేళ దొంగతనం, దోపిడి జరిగితే ఎలా స్పందించాలి? రానున్న హాలిడేస్ సీజన్ కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి ఎన్నో అంశాలపై పోలీసు (Police) అధికారులు స్థానికంగా ఉండే తెలుగువారికి అవగాహన కల్పించారు.
సైబర్ సెక్యూరిటీపై కూడా పోలీసులు అవగాహన కల్పించారు. ఆన్‌లైన్ మోసాలకు బలికాకూడదు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ సదస్సులో సూచించారు. నాట్స్ (North America Telugu Society) సభ్యులకు భద్రతపై విలువైన సూచనలు చేసినందుకు నాట్స్ చైర్ ఉమన్ అరుణ గంటి (Aruna Ganti) స్థానిక పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రతి నాట్స్ చాఫ్టర్ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయటంతో నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి (Bapaiah Nuthi) సంతోషం వ్యక్తం చేసారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ (NATS) నాయకులు గంగాధర్ దేసు, రాజ్ అల్లాడ, శ్రీహరి మందాడి, చంద్రశేఖర్ కొణిదెల, మురళీకృష్ణ మేడిచర్ల, బసవశేఖర్ శంషాబాద్, శ్రీనివాస్ భీమినేని, బిందు యలమంచిలి, ఫణి తోటకూర, సూర్యం గంటి తదితరులు పాల్గొన్నారు.