Palasa, Srikakulam, March 11: అమెరికాలో తెలుగు వారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ముమ్మరంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ (Good Touch, Bad Touch) పై అవగాహన సదస్సు నిర్వహించింది.
గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ గ్లో ఫౌండేషన్ (GLOW Foundation), హోప్ ఫర్ లైఫ్ సంస్థలతో కలిసి నాట్స్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆడపిల్లలు సమాజంలో మానవ మృగాల నుంచి తప్పించుకోవాలంటే ఎలా ఉండాలనేది ఈ సదస్సులో వివరించారు. ఆడపిల్లలు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండాలని పలాస శాసనసభ్యురాలు గౌతు శిరిష (Gouthu Sireesha) అన్నారు.
అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తినా అది కచ్చితంగా తల్లితో చెప్పాలని సూచించారు. మేం ఏం చేయలేం అనే నిస్సహాయ స్థితి నుంచి మేం ఏదైనా చేయగలమనే ధైర్యం ఆడపిల్లల్లో రావాలని హోప్ ఫర్ లైఫ్ (Hope For Life) సంస్థ వ్యవస్థాపకులు హిమజ అన్నారు. ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యం కల్పించేందుకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ (Good Touch, Bad Touch) లపై అవగాహన కల్పిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.
ఇంకా ఈ అవగాహన కార్యక్రమంలో హోప్ ఫర్ లైఫ్ (Hope For Life) సంస్థ ప్రతినిధులు ఆశాజ్యోతి, సైకాలజిస్టులు డాక్టర్ సంగీత, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌లపై ఆడపిల్లలకు పూర్తి అవగాహన కల్పించేలా ఈ సదస్సు జరిగింది.