సంబరంలో సేవ, సంబరంతో సేవ అంటూ మే 26,27,28 తారీఖుల్లో తలపెట్టిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (North America Telugu Society – NATS) ‘నాట్స్’ 7వ అమెరికా సంబరాలు 3వ రోజు అయిన మే 28న అద్వితీయంగా ముగిశాయి.
ఆదివారం ఉదయం నాట్స్ బోర్డ్ మీటింగ్ (Board Meeting) నిర్వహించారు. ఇక మెయిన్ ఆడిటోరియం హాల్లో మహిళా అష్టావధానం, సంబరాలలో భాగంగా నిర్వహించిన క్రీడల్లో విజేతలకు బహుమతులు, వివిధ కమిటీల సన్మానం, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్లారు.
ఈ సారి అమెరికా అంతటా మొదటిసారి ప్రత్యేకంగా నిర్వహించిన తెలుగమ్మాయి కార్యక్రమ ఫైనల్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. విజేతలకు అవార్డ్స్ అందజేశారు. ఈ మూడు రోజుల్లో చివరి రోజు జనం బాగా హాజరయ్యారు. భోజనాలు కూడా బాగున్నాయి.
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు, పద్మవిభూషణ్ గ్రహీత నారాయణ మూర్తి (N. R. Narayana Murthy) మరియు ఆయన సతీమణి సుధా మూర్తి (Sudha Murthy) లకు లైఫ్ టైం అఛీవ్మెంట్ అవార్డులను నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) ప్రజంట్ చేసింది.
అజరామర ధీశాలి, విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా నందమూరి సుహాసిని సమక్షంలో ఘన నివాళులు అర్పించారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ ని ఘట్టమనేని ఆదిశేషగిరిరావు సమక్షంలో నివాళులు అర్పించారు.
అలాగే నటులు సాయి కుమార్ 25 సంవత్సరాల సినీ కెరీర్ ని నెమరువేసుకుంటూ ఘనంగా సన్మానించారు. నటి నేహా శెట్టి, జబర్దస్త్ నటీనటుల పెర్ఫార్మన్సెస్, జానపద మరియు సాంఘిక కార్యక్రమాలతో రోజంతా కోలాహలంగా సాగింది.
చివరిగా వరుస సూపర్ హిట్స్ తో దూసుకెళుతున్న టాలీవుడ్ సంగీత దర్శకులు తమన్ ఎలెక్ట్రీఫయింగ్ పాటలతో వేదిక ప్రాంగణాన్ని హోరెత్తించారు. తమన్, శ్రీక్రిష్ణ, గీతామాధురి, పృథ్వి ఇలా అందరూ థండర్ మ్యూజికల్ కాన్సర్ట్ తో నాట్స్ సంబరాలకు అద్వితీయ ముగింపు పలికారు.
గ్రాండ్ ఫినాలే లో నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కన్వీనర్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ అధ్యక్షులు బాపయ్య చౌదరి (బాపు) నూతి మరియు నాట్స్ ఛైర్ ఉమన్ అరుణ గంటి మరియు సుమారు 200 మంది యువత సైతం తమ సీట్లలో నుంచి లేచి వచ్చి వేదిక ముందు గళం కలిపి చిందులేయడం చూస్తే అందరూ బాగా ఆస్వాదించినట్లు తెలుస్తుంది.