నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) నాట్స్ 3 రోజుల అమెరికా తెలుగు సంబరాలు నిన్న జులై 4న బాంక్వెట్ డిన్నర్ తో అదుర్స్ అనేలా ప్రారంభమయ్యాయి. శుక్రవారం సాయంత్రం సుమారు 6 గంటలకు నాట్స్ సభ్యులు, స్థానిక తెలుగువారు, ఇండియా నుంచి వచ్చిన అతిథుల రాకతో టాంపా కన్వెన్షన్ సెంటర్ (Tampa Convention Center)వేదిక ప్రాంగణం శోభాయమానంగా తయారయ్యింది.
ముందుగా రెజిస్ట్రేషన్ మరియు తేనీటి విందుతో అందరూ బిజీ బిజీగా కనిపించారు. అమెరికా మరియు ఇండియా జాతీయ గీతాలు (National Anthem) ఆలపించారు. అనంతరం నాట్స్ కన్వెన్షన్ కోర్ కమిటీ సభ్యుల సతీమణులు వేదికపై విఘ్నేశ్వరునికి జ్యోతి ప్రజ్వలన చేసి సంబరాలను ఘనంగా ప్రారంభించారు.
నాట్స్ కన్వీనర్ & పాస్ట్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ (Srinivas Guthikonda) మరియు నాట్స్ ప్రస్తుత బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) ఆహ్వానితులను ఉద్దేశించి కాసేపు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
నాట్స్ (NATS) కార్యవర్గ మరియు బోర్డు సభ్యులను వేదికమీదికి ఆహ్వానించి నాట్స్ సావనీర్ ని స్థానిక సెనేటర్ మరియు ప్రభుత్వ అధికారుల చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా నాట్స్ చేసిన మరియు చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను వారు అభినందించారు. పలువురు వివిధ అలంకరణా ప్రాంతాలలో ఫొటోస్ తీసుకుంటూ ఉల్లాసంగా కనిపించారు.
యాంకర్స్ రవి (Ravi) మరియు అశు రెడ్డి (Ashu Reddy) వ్యాఖ్యానం అందరినీ ఆకట్టుకుంది. జబర్దస్త్ (Jabardasth) మరియు టీవీ నటీనటులు పలువురు చిన్న స్కిట్ ప్రదర్శించారు. అలాగే లక్కీ భాస్కర్ మరియు బబుల్గమ్ సినిమాలలో నటించిన మానస చౌదరి కొన్ని టాలీవుడ్ (Tollywood) ఫాస్ట్ బీట్ పాటలకు నృత్య ప్రదర్శన చేశారు.
తదనంతరం మాడ్ మూవీ హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియా రెడ్డితన సినిమాలో హిట్ అయిన స్వాతి రెడ్డి పాటతోపాటు పుష్ప సినిమాలోని ఐటెం సాంగ్ కి డాన్స్ చేసి అందరినీ అలరించింది. బాలయ్య (Nandamuri Balakrishna), వెంకటేష్ (Venkatesh Daggubati) వచ్చేటప్పుడు మరియు తిరిగి వెళ్ళేటప్పుడు ఫాన్స్ ఎప్పటిలానే ఫోటోల కోసం ఎగబడ్డారు.
వివిధ రంగాలలో సేవలందించిన వారికి అవార్డ్స్ (Awards) ప్రధానం చేశారు. అలాగే దాతలను, వివిధ స్పాన్సర్స్, కొందరు సెలబ్రిటీస్ ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని వ్యాఖ్యాత సాహిత్య వింజమూరి (Sahitya Vinjamuri) తన వాక్చాతుర్యంతో అందరినీ కట్టిపడేసేలా నిర్వహించారు.
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన చంద్రబోస్ (Chandrabose) నాటు బ్యాండ్ తో మొట్టమొదటిసారి చేసిన సంగీత విభావరి (Live Musical Concert) చక్కగా ఉంది. నాటు, పల్లె నాటు, సిటీ నాటు, ఊర నాటు అంటూ స్లో సాంగ్స్ తో ప్రారంభించి, ఫాస్ట్ బీట్ నంబర్స్ తో హై లో ముగించారు.
పిల్లలు, పెద్దలు సైతం కాలు కదిపి కొన్ని పాటలకు చిందులు వేశారు. విందు భోజనం (Dinner) అందరినీ ఆకట్టుకుంది. దీంతో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి నిర్వహించే నాట్స్ (North America Telugu Society – NATS) అమెరికా తెలుగు సంబరాలకు గ్రాండ్ కిక్ ఆఫ్ ఇచ్చినట్లయింది.
ఈ విషయంలో నాట్స్ కన్వీనర్ & పాస్ట్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ (Srinivas Guthikonda), నాట్స్ ప్రస్తుత బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni), నాట్స్ అధ్యక్షులు శ్రీహరి మందాడి (Srihari Mandadi), నాట్స్ ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి (Madan Pamulapati) లతోపాటు నాట్స్ సంబరాల కమిటీల ప్రతినిధులందరినీ ప్రత్యేకంగా అభినందించాలి.
ఇతర జాతీయ మరియు స్థానిక తెలుగు సంస్థల (Telugu Associations) ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఈ బాంక్వెట్ డిన్నర్ కార్యక్రమంలో సినీ ప్రముఖులు మీనా, సాయికుమార్, తనికెళ్ళ భరణి, జయసుధ, టీజీ విశ్వప్రసాద్, రామజోగయ్య శాస్త్రి, మెహర్ రమేష్, మురళీధర్ గౌడ్, అమ్మర్దీప్ చౌదరి, ముక్కు అవినాష్, సుజాత, రాకేష్, అరియనా, రీతు చౌదరి, కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి సంబంధించి శాసన సభ్యులు నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar), వసంత కృష్ణ ప్రసాద్, కామినేని శ్రీనివాస్, పితాని సత్యనారాయణ అలాగే నందమూరి రామక్రిష్ణ (Nandamuri Ramakrishna), మన్నవ సుబ్బారావు, పాతూరి నాగభూషణం తదితరులు కూడా పాల్గొన్న వారిలో ఉన్నారు.