అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సమితి ‘నాటా’ తాజాగా మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మల గొప్పతనాన్ని చాటేలా వర్జీనియాలో మే 21వ తేదీన మాతృదినోత్సవ వేడుకలు నిర్వహించింది. అమ్మ ప్రేమను పంచుతున్న కొందరు తల్లులతో కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రేపటి పౌరులను తీర్చిదిద్దడంలో అమ్మ పాత్రే కీలకమని కార్యక్రమంలో పాల్గొన్న తల్లులు పేర్కొన్నారు. మహిళలకోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఈ వేడుకలలో సుమారు 500 మందికి పైగా మహిళలు పాల్గొని విజయవంతం చేశారు. అమ్మల అనుభవాలను నేటి తరానికి పంచిన ఇంత చక్కటి కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ‘నాటా’ అధ్యక్షుడు శ్రీధర్ కొర్సపాటి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమం ప్రాముఖ్యతను సుధా కొండపు వివరిస్తూ అమ్మకు ఉన్న ప్రత్యేక స్థానాన్ని తెలియజేశారు. అమ్మ మీద పాడిన పాటతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. కొంతమంది చిన్నారులు అమ్మలపై వ్రాసిన కవితలను స్వయంగా వారే చదవి వినిపించి అమ్మ పట్ల తమ ప్రేమను చాటుకున్నారు. మహిళల నృత్య ప్రదర్శనలు, ఫ్యాషన్ షో, రాఫెల్స్ బహుమతులు మరియు ఆట పాటల వంటి సరదా కార్యక్రమాలు అందరినీ ఆహ్లాదపరిచాయి.
‘నాటా’ ఆదర్శ మాతృమూర్తులుగా శ్రీమతి డా. సరోజన బండ, డా. జమున రాజు, డా. శ్రీలేఖ పల్లె, శ్రీమతి అంజల ఆనంద్, శ్రీమతి ఉమాదేవిలను సత్కరించారు. స్థానిక సంస్థల ప్రతినిధులను వివిధ రంగాలలో రాణించిన మాతృమూర్తులను కూడా సాదరంగా సత్కరించారు.
‘నాటా’ నాయకులు సుధా కొండపు, చైతన్య అమ్మిరెడ్డి, శ్రీనివాస్ సోమవారపు, సతీష్ నరాల, సురేన్ బత్తినపట్ల, ఆంజనేయ దొండేటి, సత్య పాటిల్, మధు మొతటి, మోహన్ కాలాడి, కిరణ్ గుణ్ణం, అనిత ఎరగంరెడ్డి, ఉదయ్ ఇందూరు, రమణ మద్దికుంట, ఈశ్వర్ సోము, జైరెడ్డి జొన్నల, శ్రీధర్ నాగిరెడ్డి, సోమా రెడ్డి, బాబురావు, శ్రీనాథ్ పల్లె, వేణు ఇళ్లవల, రమేష్ వల్లూరి, సురేష్ కొత్తఇంటి తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి తమ వంతు సహకారం అందించారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ‘నాటా’ నాయకులు పలువురు పాల్గొన్నారు. అమ్మల అనుభవాలు, త్యాగాలు తెలుసుకుంటే మనలో కొందరికైనా ఎంతో కొంత స్ఫూర్తిని రగిలిస్తుందనే ఉద్ధేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టామని నాటా బోర్డ్ అఫ్ డైరెక్టర్స్ అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.