నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘నాటా’ ఆధ్వర్యంలో మార్చి 27న అమెరికాలోని డల్లాస్ నగరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. డల్లాస్ లోని మినర్వా బాంక్వెట్స్ లో జరిగిన ఈ వేడుకలలో నాలుగు వందలకు పైగా తెలుగు ఆడపడుచులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
నాటా మహిళా కమిటీ కో-చైర్ స్వాతి సన్నపురెడ్డి, నాటా బోర్డు డైరెక్టర్ రమణా రెడ్డి క్రిస్టపాటి ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వాలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సంగీత దర్శకులు కోటి విచ్చేసారు. వివిధరంగాలలో విశేష సేవలు అందిస్తున్న మహిళల ప్రసంగాలతో పాటు అనేక సాంస్కృతిక ప్రదర్శనలతో ఈ వేడుకలు తెలుగు ప్రవాస మహిళల్లో ఉత్తేజాన్ని నింపాయి.
ఈ కార్యక్రమంలో డా. సురేఖ మాచుపల్లి మాట్లాడుతూ మహిళల ఆరోగ్య విషయాలను తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం కరాటే చాంపియన్ సింధు తపస్వి మహిళలలో ఆత్మ విశ్వాసం పెంచడానికి మరియు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభావితం చేసే పరిస్థితులను చక్కగా వివరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగీత దర్శకులు కోటి మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి మహిళలు చేస్తున్న సేవలను అభినందించారు.
నాటా అధ్యక్షులు డా. శ్రీధర్ రెడ్డి కొరసపాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు పురస్కారాలు అందజేసిన అనంతరం ప్రసంగిస్తూ నాటా సంస్థ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యతను, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి నాటా ఆధ్వర్యంలో చేపట్టే ప్రణాళికను వివరించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ కార్డియాలజీస్ట్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, మల్లికా రెడ్డి, సుధా ఆవుల, సరితా రెడ్డి, నాటాకు చెందిన డైరెక్టర్లు డా. పవన్ రెడ్డి, వెంకట రమణ మురారి, రవి అరిమండ, కో-కన్వీనర్ కృష్ణా రెడ్డి కోడూరు, సునీల్ దేవిరెడ్డి, మధు మల్లు, సుబ్బారెడ్డి కొండ్రు, రీజినల్ వైస్ ప్రెసిడెంట్ వీరారెడ్డి వేముల మరియు ఎక్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు. చివరిగా ఈ కార్యక్రమానికి సహాయం అందించిన వారికి, మీడియా మిత్రులకు, ఆహ్వానితులకు నాటా నాయకత్వం ధన్యవాదాలు తెలిపింది.