. 300 మందికి పైగా మహిళామణులు హాజరు . మానవత్వాన్ని చాటుకున్న షార్లెట్ ‘నాటా’ టీం . కష్టాల్లో ఉన్న మహిళకు ఆర్ధిక సహాయం . స్ఫూర్తి నింపేలా మరో మహిళకు సన్మానం . ఆటపాటలతో సందడి సందడిగా వేడుకలు
నార్త్ కేరోలీనా రాష్ట్రం, షార్లెట్ నగరంలో ఈ నెల మార్చి 12న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంబరాన్నిఅంటాయి. షార్లెట్ నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘నాటా’ త్రయం సునీత రెడ్డి, అను పన్నెం, అనిత వొజ్జల ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు.
కార్యక్రమం ఆసాంతం సాహిత్య వింజమూరి యాంకరింగ్ ఈ వేడుకలో అందరినీ ఆకర్షించింది. మిసెస్ కేరోలినా పోటీ ఆహుతుల ప్రశంసలను అందుకుంది. వివిధ పోటీలు, కార్యక్రమాలలో విజేతలైన మహిళలకు చక్కటి బహుమతులు ఇవ్వడం జరిగింది. శ్వేత గుండపునేని మరియు ఝాన్సి అబ్బూరి తమ నృత్య బృందాలతో ప్రేక్షకులను అలరించారు.
గుణ కొమ్మారెడ్డి గత 28 సంవత్సరాలుగా షార్లెట్‌లోని తెలుగు మహిళలకు ఇచ్చిన స్ఫూర్తి, అలాగే కమ్యూనిటీ కి చేసిన సేవలకుగాను ఆమెను సత్కరించారు. ఈ కార్యక్రమం ద్వారా షార్లెట్‌లోని మహిళలకు వినోదాన్ని అందించాలనే లక్ష్యం కాకుండా కొన్ని వారాల క్రితం తన భర్తను కోల్పోయిన మైథిలి రాజప్పకు ఆర్ధికంగా సహాయం చేయడం జరిగింది. ఆమె భర్తను కోల్పోయిన కొన్ని వారాలకు ఆమె చక్కటి పాపకు జన్మనిచ్చింది. చాలా మంది స్పాన్సర్లు అలాగే ఎంతోమంది వ్యక్తిగతంగా ముందుకు వచ్చి ఆమెకు ఆర్ధికంగా సహాయం అందించారు.
సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మహిళామణులు సృష్టిస్తున్న విజయాలు మహిళల గొప్పతనాన్ని చెప్పకనే చెబుతున్నాయి. గృహిణిగానే కాకుండా వ్యవసాయం మొదలుకొని దేశ సరిహద్దుల్లో రక్షణ వరకు, అంతరిక్ష ప్రయోగాలలో విజయాలను సాధించే వరకు మహిళలు పోషిస్తున్న పాత్ర గణనీయమైనది. అటువంటి మహిళలను గుర్తిస్తూ జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారికి స్ఫూర్తి నివ్వడమే కాకుండా, వారు సాధించాల్సిన విజయాలను, పరిష్కరించాల్సిన సమస్యలను వారికి గుర్తు చేస్తుందని చెప్పడం అభినందనీయం.