నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో గత 23 రోజులుగా చికిత్స పొందుతన్న సంగతి అందరికీ తెలిసిందే. మృత్యువుతో తీవ్రంగా పోరాడిన తారకరత్న భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఫిబ్రవరి 18 మహా శివరాత్రి రోజు మరణించారు. దీంతో టీడీపీ, నందమూరి అభిమానులు శోకసముద్రంలో మునిగారు.
ఆంధ్రప్రదేశ్ లోని కుప్పంలో జనవరి 27న టీడీపీ యువనేత నారా లోకేశ్ (Nara Lokesh) యువగళం పాదయాత్రలో నడుస్తుండగా గుండె పోటు రావడంతో తారకరత్న కుప్పకూలారు. హుటాహుటిన సమీప ఆస్పత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణా హృదయాలయా ఆస్పత్రికి తీసుకెళ్లారు. విదేశీ వైద్య బృందం సైతం ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
నందమూరి తారకరత్నకు భార్య అలేఖ్య రెడ్డి (Alekhya Reddy), ఓ కూతురు ఉన్నారు. నందమూరి మోహన కృష్ణ తనయుడు, ఎన్టీఆర్ (NTR) మనవడు అయిన తారకరత్న, బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రోత్సాహంతో సినిమాల్లోకి వచ్చారు. ఒకటో నెం కుర్రాడు సినిమాతో హీరోగా టాలీవుడ్ లో అడుగు పెట్టారు. తారకరత్న హీరోగా, ప్రతినాయకుడిగా పలు పాత్రల్లో తెలుగువారిని ఆకట్టుకున్నారు. అమరావతి (Amaravati) సినిమాకి తారకరత్న ఉత్తమ విలన్‌గా నంది అవార్డు (Nandi Award) ను అందుకున్నారు. చివరిగా సారధి మూవీలో నటించారు.