ఈ రోజు ఇటు తెలుగు సినీ పరిశ్రమ అటు తెలుగు వారందరూ గర్వపడే రోజు. ఒక రకంగా ఇండియా మొత్తం గర్వపడే రోజు. ఎందుకంటే RRR తెలుగు సినిమాలోని నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ (Golden Globe) అవార్డు గెలుచుకుంది. ఇంతటి ప్రముఖ అవార్డు అందుకోవడానికి వేదిక కాలిఫోర్నియా (California) లోని లాస్ ఏంజెలెస్ నగరమయ్యింది.
ఈ కార్యక్రమంలో హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli), సంగీత దర్శకులు ఎమ్.ఎమ్. కీరవాణి వారి వారి సతీ సమేతంగా కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్, మోషన్ పిక్చర్ కేటగిరీలో కాలిఫోర్నియాలోని బెవెర్లీ హిల్స్‌లో అవార్డు ప్రకటించిన ఆనందంలో ఒక్కసారిగా అందరూ లేచి కేరింతలు కొట్టారు.
ఈ రోజు మంగళవారం, జనవరి 10న కాలిఫోర్నియా నడిబొడ్డున నిర్వహించిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ల ఫంక్షన్ లో సినిమా సంగీత దర్శకులు ఎమ్.ఎమ్. కీరవాణి (MM Keeravani) హాలీవుడ్ (Hollywood) నటుల హర్షధ్వానాల మధ్య ప్రెస్టీజియస్ అవార్డు అందుకున్నారు. ఇదే మొట్టమొదటి నామినేషన్. మొట్టమొదటిసారి గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడం భారతదేశానికే గర్వకారణం.
ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ పాట రాసిన చంద్రబోస్ (Chandrabose) దగ్గిర నుంచి, డాన్స్ కంపోజ్ చేసిన ప్రేమ్ రక్షిత్, అలాగే పాట పాడిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, డాన్స్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan), సినిమా డైరెక్ట్ చేసిన రాజమౌళి ఇలా ఆ పాట కోసం పనిచేసిన ప్రతి ఒక్కరినీ సభాముఖంగా కొనియాడారు.