డెట్రాయిట్ నగరంలో నవంబర్ 10న ఇండియన్ అమెరికన్ కూటమి ఆధ్వర్యంలో జరిగిన మిచిగన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్ ఫండ్ రైజర్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. డెట్రాయిట్ మెసోనిక్ టెంపుల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 500 మందికి పైగా స్థానిక అమెరికన్లు మరియు భారత సంతతికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
ధవల్ వైష్ణవ్, అశోక్ బడ్డి, మురహరి దేవబత్తిని తదీతర సభ్యుల నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అథితిగా గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్ తో పాటూ, కాంగ్రెస్ ఉమన్ హ్యాలీ స్టీవెన్స్, బ్రెండా లారెన్స్ మరియు మిచిగాన్ సెక్రటరీ అఫ్ స్టేట్ జోసెలిన్ బెన్సన్ అథితులుగా విచ్చేసారు. ఇందులో వందల సంఖ్యలో వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ఈ సభ మిచిగన్ బిజినెస్ లో భారతీయుల ఉనికిని, సత్తాని ఎత్తి చూపింది. గవర్నర్ ఫండ్ కోసం విరాళాలు సేకరించడానికి మొత్తం మిచిగన్ బిజినెస్ కమ్యూనిటీ అంతా ఒక త్రాటి మీదకు వచ్చి రెండు లక్షల ముప్పైయెనిమిది వేల డాలర్ల విరాళ సేకరణ తో రికార్డ్ స్థాపించారు.
స్టేట్ రెప్ పద్మ కుప్ప మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో విట్మర్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా అన్నట్టు అమెరికన్ జాతీయ గీతం తో పాటు భారత జాతీయ గీతాన్ని అశోక్ బడ్డి గారి ఆధ్వర్యంలో పాడిన పిల్లలు అందరినీ ఎంతగానో అలరించి, సభా స్ఫూర్తి కి వన్నె తెచ్చారు. పలు నాట్య ప్రదర్శనలు, సమైక్య గీతాలు అందర్నీ రంజింప చేసాయి. ఈ విధమైన సభలు ప్రవాస భారతీయుల ఉనికిని భవిష్యత్తు ప్రణాళికల్ని పటిష్టం చేస్తాయని, అమెరికా రాజకీయాలలో నూతనావకాశాలతో మన పాత్రని పెంచి పటిష్టం చేయడానికి దోహద పడతాయని, అంతే కాకుండా మన సంస్కృతి, జీవన విధానం గురించి అవగాహన పెరిగి అమెరికాలో ప్రస్తుత మరియు రాబోయే కాలంలో ప్రవాసుల అభివృద్ధికి ఎంతో ఉపకరిస్తాయని కార్యనిర్వాహకులు తెలిపారు.