సీనియర్ నటులు నరేష్ సారధ్యంలోని మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ‘మా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ పదవీకాలం ముగిసినందువల్ల తక్షణమే ఎలక్షన్స్ నిర్వహించాలని మెగాస్టార్ చిరంజీవి క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ రెబల్ స్టార్ కృష్ణంరాజుకు లేఖ రాసినట్లు తెలిసింది. సెప్టెంబర్ 12న కొత్తకార్యవర్గం కోసం ఎలక్షన్స్ నిర్వహించాలని కోరుతూ కొంతమంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఇంతకుముందే కృష్ణంరాజుకు లేఖ రాసిన సంగతి తెలిసిందే.
ఇంకోపక్క ‘మా’ లో భవనమే కాదు ఇంకా చాలా సమస్యలున్నాయి అంటూ మీడియా ముందుకు వచ్చి ప్రస్తుత మా అధ్యక్షులు నరేష్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు నటి హేమ. అలాగే నటులు ప్రకాష్ రాజ్ కూడా తెగేదాకా లాక్కండి అంటూ ట్వీట్ చేసి హీట్ పెంచారు. ఈ మధ్య వర్చువల్ విధానంలో ఈసీ మీటింగ్ జరగడం, వచ్చే ఆగష్టు 22న జరిగే సమావేశంలో ఎన్నికలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటాం అని నరేష్ అనడం, అలాగే ఈసీ మీటింగ్ అంటే మూడో ప్రపంచ యుద్ధమే అంటూ నటి జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్ వ్యాఖ్యానించడం, అంతకుముందు హీరో మంచు విష్ణు వీడియో మెసేజ్ తదితర పరిస్తుతులను చూసి ‘మా’ ప్రతిష్ఠ మసకబారుతోందని చిరంజీవి ఆ లేఖ రాసి ఉండొచ్చు అంటున్నారు సినీ పండితులు.