కృష్ణా జిల్లా వీరులపాడు మండలంలోని తానా అపలాచియన్ రీజియన్ సమన్వయకర్త నాగ పంచుమర్తి స్వగ్రామం గోకరాజుపల్లిలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA), తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చైతన్య స్రవంతి క్రార్యక్రమాలకు ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఏర్పాట్లకు తగినట్టుగానే ముఖ్య అతిధులుగా కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నేత కేశినేని శివనాధ్ (చిన్ని), మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వంటి ప్రముఖులతోపాటు పెద్ద ఎత్తున జనం విచ్చేసారు. డిసెంబర్ 22 ఉదయాన్నే రిబ్బన్ కటింగుతో మొదలైన ఉచిత వైద్య శిబిరాలతో పాటు అనంతరం నిర్వహించిన అన్ని తానా సేవా కార్యక్రమాలు విజయవంతమయ్యాయి.
ఈ సందర్భంగా తానా చేయూత ప్రాజెక్ట్ ద్వారా 56 మంది పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, తానా ఆదరణ ప్రాజెక్ట్ ద్వారా 15 సైకిళ్ళు, మహిళలకు 15 కుట్టు మిషన్లు, వికలాంగులకు 6 ట్రై సైకిళ్ళు మరియు తానా రైతు కోసం ప్రాజెక్ట్ ద్వారా రైతులకు 100 కిట్లు, 10 పవర్ స్ప్రేయర్లు అందించారు.
చక్కగా అలంకరించిన ఎడ్లబండి మీద ఊరేగింపుగా ముఖ్య అతిథులను వేదిక దగ్గిరకు తీసుకురావడం అందరినీ ఆకట్టుకుంది. వేదికపై తానా అపలాచియన్ రీజియన్ సమన్వయకర్త నాగ పంచుమర్తి కోరిక మేరకు గ్రామంలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తానన్నారు కేశినేని చిన్ని.
అలాగే వృద్ధాశ్రమం లేదా అనాధాశ్రమం కూడా ఏర్పాటు చేయవలసిందిగా నాగ తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు ని కోరారు. స్థలం విషయంలో తను సహకరిస్తాననడంతో అంజయ్య చౌదరి కూడా సానుకూలంగా స్పందించారు. దీంతో గ్రామస్తులు నాగ పంచుమర్తి ని అభినందించారు.వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
గ్రామంలోని అన్న నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలదండలు వేసి నమస్సుమాంజలి తెలిపారు. వైద్య శిబిరంలో ఆరోగ్య పరీక్షల అనంతరం అవసరమైన మందులు కూడా ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు నాగా పంచుమర్తి, తానా నాయకులు మరియు అతిథులను శాలువా పుష్ప గుచ్చంతో సత్కరించారు.
తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానాఫౌండేషన్ చైర్మన్ వెంకటరమణ యార్లగడ్డ, చైతన్యస్రవంతి కో ఆర్డినేటర్ సునీల్ పాంత్రా తోపాటు రాజా కసుకుర్తి, డా. ఉమా ఆరమండ్ల కటికి, ఠాగూర్ మల్లినేని, శ్రీనివాస్ కూకట్ల, శశాంక్ యార్లగడ్డ, జోగేశ్వరరావు పెద్దిబోయిన తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అంజయ్య చౌదరి మాట్లాడుతూ, ప్రపంచంలోనే తానా అతి పెద్ద సంస్థ అని అంటూ అమెరికాలో తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు తానా చేస్తున్న కృషిని వివరించారు. అమెరికాలోని చిన్నారులకు తెలుగు భాషను నేర్పించేందుకు తానా పాఠశాలను ఏర్పాటు చేశామని అన్నారు.
తెలుగు కళల పరిరక్షణకు వీలుగా అమెరికాలో నిర్వహించే కార్యక్రమాల్లో ఇక్కడి కళాకారులకు అవకాశం ఇస్తున్నామని చెప్పారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో తానా చైతన్యస్రవంతి ద్వారా రైతులకు, ఇతరులకు సేవా కార్యక్రమాలను చేస్తున్నామని తెలిపారు.
అమెరికాలో తాము స్థిరపడినా జన్మభూమికి ఏదైనా సేవ చేయాలన్న సంకల్పంతో తానా ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఇతర తానా నాయకులు తమ ప్రసంగాల్లో చెప్పారు. ముఖ్య అతిధులు కూడా తమ ప్రసంగాల్లో తెలుగువారికి తానా చేస్తున్న సేవలను ప్రశంసించారు.