Johns Creek, Atlanta: అట్లాంటాలోని జాన్స్ క్రీక్ సిటీలో ఫిల్మ్ కెరీర్ వర్క్ షాప్ నిర్వహించారు. ఇండో అమెరికన్ ఫిల్మ్ అకాడమీ ఆధ్వర్యంలో టర్నింగ్ డ్రీమ్స్ ఇంటూ రియాలిటీ అంటూ నిర్వహించిన ఈ వర్క్ షాప్ కి అకేషన్స్ అట్లాంటా (Occasions Atlanta) వేదికయ్యింది.
ముందుగా యాంకర్ పృథ్వి అందరికీ స్వాగతం పలుకగా, అన్నపూర్ణ స్టూడియో ఫిల్మ్ స్కూల్ (Annapurna Studio Film School) డీన్ ఎమెరిటస్ బాల రాజశేఖరుని ఫిల్మ్ కెరీర్ వర్క్ షాప్ నిర్వహించారు. ఇండియా, అమెరికా సినీ ఇండస్ట్రీలకి సంబంధించిన సినిమాల క్లిప్స్ ప్రదర్శించి విశ్లేషణ చేశారు.
అలాగే సినిమాని కెరీర్ గా మార్చుకునేవారికి, సినిమాకి సంబంధించి అన్ని క్రాఫ్ట్స్ ని విపులంగా వివరించారు. పలువురు అడిగిన ప్రశ్నలకు బాల రాజశేఖరుని (Bala Rajasekharuni) సమాధానాలు అందించారు. ఇండియా సినిమాలు అమెరికాలో షూట్ చేయడానికి వచ్చ్చినప్పుడు మనం ఒక ప్లాట్ఫారం ఏర్పాటుచేయాలన్నారు.
అనంతరం ప్రముఖ రంగస్థల నటులు, రచయిత, టాలీవుడ్ తెలుగు సినీ మాటల రచయిత, స్క్రీన్ రైటర్, ఆంధ్ర ప్యారిస్ తెనాలి వాసి బుర్రా సాయి మాధవ్ (Burra Sai Madhav) తో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఆహ్వానితులందరూ ఉత్సహంగా ఫోటోలు దిగారు. ఆహ్వానితులు అడిగిన అనేక ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇచ్చారు.
రంగస్థల నటునిగా, నాటక రచయితగా, టి.వి ధారావాహికల రచయితగా ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ, ఇప్పుడు ప్రసిద్ధ సినిమా మాటల రచయితగా, స్క్రీన్ రైటర్ గా సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందే స్థాయికి చేరడంలో చేసిన కృషి వెనుక ఉన్న నేపధ్యాన్ని బుర్రా సాయి మాధవ్ వివరించారు.
‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాతో సినీ సంభాషణల రచయితగా సినీ రంగానికి పరిచయమవడం, తాను మాటలు రాసిన “కంచె”, “మహానటి” రెండు సినిమాలు భారత ప్రభుత్వముచే ఉత్తమ ప్రాంతీయ చిత్రాలుగా జాతీయ పురస్కారాలు అందుకోవడం సంతోషమన్నారు బుర్రా సాయి మాధవ్(Burra Sai Madhav).
“మళ్లీ మళ్లీ ఇది రానిరోజు” సినిమాకు ఉత్తమ మాటల రచయితగా నంది పురస్కారం, ”పుత్తడిబొమ్మ”, “సీతామహాలక్ష్మి” ధారావాహికలకు ఉత్తమ రచయితగా నంది పురస్కారాలు అందుకోవడం తన రచనా జీవితంలో కొన్ని మైలురాళ్ళు మాత్రమేనని, ఇంకా ఎంతో సాధించ వలసినది ఉంది అన్నారు.
‘కృష్ణం వందే జగద్గురుం”, “గోపాల గోపాల”, “కంచె”, “సర్దార్ గబ్బర్ సింగ్”, “గౌతమీపుత్ర శాతకర్ణి”, “మహానటి”, “ఖైదీ # 150” లాంటి పలు సినిమాలలో తాను వ్రాసిన మాటలకు వచ్చిన ప్రేక్షకాదరణ తనకు ఎంతో సంతృప్తిని, బలాన్ని ఇచ్చిందని ఈ అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు, నటులకు, ఆదరించిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదములు అన్నారు బుర్రా సాయిమాధవ్.
తాను ఏమి వ్రాసినా సామాజిక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని రచనలు చేస్తానని, సమాజానికి హాని కల్గించే మాటలు తనను ఎంత ప్రలోభ పెట్టినా తన కలం నుండి వెలువడవని అందరి హర్షద్వానాలమధ్య సాయి మాధవ్ (Burra Sai Madhav) వెల్లడించారు.
సినీరంగంలో ఎంత ఎత్తుకు ఎదిగినా, తాను వచ్చిన నాటక రంగాన్ని విస్మరించకుండా, ‘కళల కాణాచి’ అనే సాంస్కృతిక సంస్థను స్థాపించి, రంగస్థల కళాభివృద్ధి కోసం లక్షలాది రూపాయల తన స్వంత నిధులను సైతం వెచ్చిస్తూ, ఎన్నో సంవత్సరాలగా సాయిమాధవ్ చేస్తున్న కృషి ఆదర్శప్రాయమైనది అని ఆహ్వానితులు కొనియాడారు.
అనంతరం పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రఖ్యాత సినీ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry) గారి సోదరుడు చేంబోలు శ్రీరామశాస్త్రి వ్రాసిన “సిరివెన్నెల తొలి గురువు ‘సమ్మాన్యుడు’ కొత్తగా” అనే పుస్తకాన్ని బుర్రా సాయిమాధవ్ ఆవిష్కరించారు. పలువురు పెద్దల చేతుల మీదుగా శాలువా, జ్ఞాపికతో బుర్రా సాయి మాధవ్ ని ఘనంగా సన్మానించారు.
ఉల్లాసంగా సాగిన ఈ కార్యక్రమంలో సతీష్ ముసునూరి, శ్రీనివాస్ లావు, అనీల్ రెడ్డి బొద్దిరెడ్డి, చాంద్ అక్కినేని, మధుకర్ యార్లగడ్డ, కిషోర్ తాటికొండ, రామారావు వెన్నెల, గుడివాడ బీజేపీ నాయకులు దావులూరి సురేంద్ర బాబు, శ్రీవల్లి రాజు, శ్రీనివాస్ రామిశెట్టి, శేఖర్ కొల్లు తదితర అట్లాంటా (Atlanta) వాసులు, సినీప్రియులుహాజరయ్యారు.