Connect with us

Events

డాలస్ లో ‘తనికెళ్ళ భరణితో ముఖాముఖి’ ఘనవిజయం: TANA, TANTEX

Published

on

డాలస్, టెక్సాస్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో స్థానిక ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాన్ టెక్స్) సహకారంతో ఆదివారం అర్వింగ్ లోని మైత్రీస్ బాంక్వెట్ హాల్ లో నిర్వహించిన “తనికెళ్ళ భరణితో ముఖాముఖి” కార్యక్రమం క్రిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య, అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఘనంగా జరిగింది. తానా డాలస్, ఫోర్ట్ వర్త్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన సభకు విచ్చేసిన భాషాభిమానులకు, ముఖ్యఅతిథి తనికెళ్ళ భరణికి స్వాగతం పల్కగా డా. నల్లూరి ప్రసాద్ భరణికి పుష్పగుచ్చం యిచ్చి ఆహ్వానం పలికారు.

తానా పూర్వాధ్యక్షులు డా. తోటకూర ప్రసాద్ సభకు అధ్యక్షత వహించి ముఖ్య అతిథిని సభకు పరిచయం చేస్తూ .. భరణి తన వృత్తి జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు, ఒడిదుడుకులు, కష్ట సుఖాలు చవిచూశారని, వీటన్నిటినీ తట్టుకుని నిలబడ్డారు గనుకనే ఎవ్వరూ ఊహించనంత ఎత్తుకు ఎదిగారని, ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగిఉండి, తన మూలాలను మర్చిపోకుండా, తాను నడిచి వచ్చిన దారులను తరచూ తడిమి చూసుకునే గొప్ప మనస్తత్వం కల్గిన వ్యక్తి అని దాదాపు 800 కి పైగా చిత్రాలలో విభిన్నమైన పాత్రలలో, వైవిద్యభరితమైన నటనతో మూడు సార్లు నంది పురస్కారాలతో సహా అనేక గౌరవాలు పొందారన్నారు. నాటక రచయిత, రంగస్థల నటుడు, సినీ సంభాషణా రచయిత, కవి, కథా రచయిత, సినీ నటుడు, సినీ నిర్మాత, సినీ దర్శకుడు తనికెళ్ళ భరణి గార్కి స్వాగతం అంటూ వేదిక మీదికి ఆహ్వానించినప్పుడు మిన్నంటిన ప్రేక్షకుల హర్షద్వానాలు, కరతాళధ్వనులు మధ్య భరణి వేదికనలంకరించారు. 

దాదాపు 2:30 గంటలకు పైగా ఉత్సాహంగా సాగిన కార్యక్రమంలో ప్రేక్షకులు అడిగిన అనేక ప్రశ్నలకు ఓర్పుగా, నేర్పుగా, వినోదాత్మకంగా సమాధానాలిచ్చారు. ప్రవాసాంధ్రులు తమ పిల్లలకు తెలుగు భాష నేర్పే క్రమం, తెలుగు భాష, సాహిత్యాలకిచ్చే ప్రాముఖ్యం బహుధా ప్రసంశనీయం అన్నారు. అమెరికానుండి భారతదేశం వచ్చి తెలుగు నేర్చుకుని, అవలీలగా అవధానాలు చేయగల్గే స్థాయికి చేరుకున్న యువకుడు, ఆస్టిన్ నగరవాసి అవధాని గన్నవరం లలిత్ ఆదిత్య భావితరాలకు స్ఫూర్తిదాయకం అన్నారు.

ప్రవాసంలో నివసిస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలకు ఛందస్సు, వ్యాకరణం లాంటి సంక్లిష్టమైన అంశాలపై దృష్టిపెట్టకుండా  సరళమైన తెలుగును పెద్దబాలశిక్షనుండి బోధిస్తే సరిపోతుందన్నారు. తెలుగు భాష పరిరక్షణ, పరివ్యాప్తి కోసం తనవంతు సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ తాను సంసిద్దంగా ఉన్నానని, ఇంతటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన సన్నిహిత మిత్రులు,  తానా పూర్వాధ్యక్షులు అయిన డా. తోటకూర ప్రసాద్ కు తానా, టాన్ టెక్స్ నాయకులకు కృతజ్ఞతలు అన్నారు. .

భరణి ఇటీవలే స్వయంగా రచించిన “శ్రీకాళహస్తి మహత్యం”, “కన్నప్ప కథ”, తాను వెలువరించిన బి.వి.ఎస్ శాస్త్రి రచించన ‘భోగలింగ శతకం’ నుండి కొన్ని పద్యాలను శ్రావ్యంగా ఆలపించి అందరినీ అలరించారు. కార్యక్రమం చివర్లో తానా, టాన్ టెక్స్ సంస్థల నాయకులు ముఖ్యఅతిథి తనికెళ్ళ భరణిని “బహుముఖ కళావల్లభ” అనే బిరుదుతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమం విజయవంతం గావడానికి ఆర్ధిక, హార్దిక సహకారం అందించిన లోకేష్ నాయుడు కొణిదల, డా. ప్రసాద్ నల్లూరి, గిరి గోరంట్ల, వెంకట్ బొమ్మా, సతీష్ మండువ, కుమార్ నందిగం, కృష్ణమోహన్ దాసరి, రవీంద్ర చిట్టూరి, అనంత్ మల్లవరపు, చంద్రహాస్ మద్దుకూరి, చలపతి కొండ్రగుంట లకు, మైత్రీస్ ఇండియన్ రెస్టారెంట్ యాజమాన్యానికి, ప్రసారమాధ్యమాలకు, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘానికి, తానా ఆహ్వానాన్ని మన్నించి సభకు విచ్చేసిన ముఖ్యఅతిథి తనికెళ్ళ భరణికి, భాషాభిమానులకు తానా డాలస్, ఫోర్ట్ వర్త్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షుడు ఉమా మహేష్ పార్నపల్లి తన మలిపలుకులలో  తెలుగు భాష, సాహిత్య వికాసానికి తానాతో కలసి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి తమ సంస్థ ఎల్లప్పుడూ సిద్ధమేనంటూ, సభకు విచ్చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.    

కార్యక్రమం అనంతరం ఇర్వింగ్ పట్టణంలోనే నెలకొనిఉన్న అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మా గాంధీ స్మారకస్థలిని దర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పించి, ఇంతటి బృహత్తర నిర్మాణానికి కారణభూతులైన మహాత్మా గాంధీ మెమోరియల్ స్థాపక అధ్యక్షులు డా. తోటకూర ప్రసాద్ కు వారి కార్యవర్గానికి శతకోటి వందనాలు అన్నారు. “తనికెళ్ళ భరణి తో ముఖా ముఖీ” కార్యక్రమం పూర్తి కార్యక్రమాన్ని పై యు ట్యూబ్ లంకె ద్వారా చూడవచ్చును.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected