Connect with us

Celebrations

ఘనంగా బ్రహ్మశ్రీ మారేపల్లి నాగ వేంకట శాస్త్రి షష్ట్యబ్ది ఉత్సవం: Silicon Andhra, California

Published

on

సిలికానాంధ్ర ఆధ్వర్యంలో బే ఏరియా తెలుగు వారంతా కలిసి మిల్ పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో డా.లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో ఆదివారం మధ్యాహ్నం బ్రహ్మశ్రీ మారేపల్లి నాగవేంకటశాస్త్రి గారి 60వ పుట్టినరోజు వేడుకను ఘనంగా జరిపారు. VEDA (Vedic Education and Devotional Academy) సంస్థ వ్యవస్థాపకుడు, ఆ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ప్రధాన పూజారి అయిన శ్రీ శాస్త్రి గారు, ఒక్క తెలుగు వారికే కాక బే ఏరియా లోని భారతీయులందరికీ సుపరిచుతులు. వీరు ఒక్క పురోహితులే కాక ఆధ్యాత్మిక గురువు కూడా. ఎందరికో సంస్కృత వ్యాకరణం, వేద పఠనం నేర్పుతూ, అమెరికాలో ఆర్షసంప్రదాయాన్ని నిలబెట్టడానికి తనవంతు కృషి చేస్తున్న సనాతన ధర్మ పరిరక్షకుడు శ్రీ శాస్త్రి గారు.

వారి శిష్యులు, శ్రేయోభిలాషులు, పురజనులంతా వీధికి రెండువైపులా నిలబడి పువ్వులు, మంగళ ద్రవ్యాలు చల్లుతుండగా, సిలికానాంధ్ర సైనికులు పండితుల వేదపఠనాల మధ్య, శ్రీ శాస్త్రిగారిని అందంగా అలంకరించిన పల్లకీలో కూర్చోబెట్టి ఊరేగింపుగా సభలోకి తీసుకువచ్చి తమ గురుభక్తిని, ఆయనపై వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు. కుమారి ఆరుషి అయ్యగారి గణపతి ప్రార్థనా గీతంతో కార్యక్రమం ప్రారంభమయ్యింది.

సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కూచిభొట్ల ఆనంద్ గారు మాట్లాడుతూ, సిలికానాంధ్ర ఆవిర్భావం నుండి నేటి వరకు, 21 సంవత్సరాల పాటు, వారి వేదపఠనంతోనే తమ సంస్థ కార్యక్రమాలు మొదలవుతాయని, వారితో సంస్థకున్న ప్రగాఢ అనుబంధాన్ని సభికులకు తెలియజేసారు. శ్రీ రావు తల్లాప్రగడ గారి బృందం శ్రీ శాస్త్రి గారి జననం నించి నేటి వరకు వారు సాధించిన విజయాలను, సనాతన ధర్మ వ్యాప్తికి వారుచేస్తున్న కృషిని ఒక AV రూపంలో ప్రేక్షకులకు ప్రదర్శించారు. కుమారి ఈష, కుమారి శ్రీమయి లక్ష్మీ చాగంటిల శాస్త్రీయ నృత్య ప్రదర్శనల తరువాత వేద మంత్రాలతో శ్రీ శాస్త్రి గారి దంపతులను వేదికమీదకు తీసుకువచ్చి, సిలికానాంధ్ర సభ్యులు శాస్త్రోక్తంగా గురుపూజ నిర్వచించారు.

అనంతరం శ్రీ శాస్త్రిగారు తనకు శ్రీ కూచిభొట్ల ఆనంద్ గారితో గల పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ, ఇది కాకతాళీయం కాదని, పూర్వజన్మల సంబంధమని పేర్కొన్నారు. తనకు జరిగిన సత్కారానికి కృతజ్ఞతలు తెలుపుతూ తాను స్వయంగా వ్రాసిన రెండు కవితలను చదివి వినిపించారు. ఆ భావకవితలు సభికులను చాలా ఆకట్టుకున్నాయి. ప్రస్తుత దేవస్థానం అధ్యక్షులు శ్రీ దయాకర్ దువ్వూరు గారు మాట్లాడుతూ ఇలా ఒక గొప్ప వ్యక్తికి, గురువుకి సన్మానం చేయడం మన బాధ్యత అని, తనూ ఇందులో భాగస్వామి కావడం ఆనందంగా ఉందని చెప్పారు.

కార్యక్రమానంతరం, అతిధులందరికీ అచ్చ తెలుగు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమం విజయవంతం చెయ్యడానికి విశేష కృషి చేసిన సిలికానాంధ్ర నాయకత్వ సభ్యులు, శ్రీ కొండిపర్తి దిలీప్ గారు, శ్రీ కందుల సాయి గారు, శ్రీ సంగరాజు దిలీప్ గారు, శ్రీ శివ పరిమి గారు, శ్రీమతి ప్రియ తనుగుల గారు, శ్రీ సింహాద్రి కిరణ్ గార్లను అభినందించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected