Connect with us

News

మదనపల్లెలో రెండు రోజులపాటు లోకేష్ నాయుడు ఆధ్వర్యంలో విజయవంతంగా సేవా కార్యక్రమాలు

Published

on

డిసెంబర్ 28, 29 తేదీలలో రెండు రోజులపాటు తానా కౌన్సిలర్ ఎట్ లార్జ్ లోకేష్ నాయుడు (Lokesh Naidu Konidala) కొణిదల స్వస్థలం చిత్తూరు (Chittoor) జిల్లా, మదనపల్లెలో నిర్వహించిన తానా (Telugu Association of North America) చైతన్య స్రవంతి సేవా కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి.

విజయవంతంగా నిర్వహించిన ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, పూర్వాధ్యక్షులు సతీష్ వేమన, 2023 తానా కన్వెన్షన్ కన్వీనర్ రవి పొట్లూరి, తానా చైతన్య స్రవంతి కోఆర్డినేటర్ సునీల్ పంత్ర మరియు ఇతర స్థానిక ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభించారు.

దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన అన్న నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) విగ్రహానికి పూలదండలతో అంజలి ఘటించి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లారు.

డిసెంబర్ 28న తానా కళోత్సవాల సభలో 40 మంది పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, 40 సైకిళ్ళు, పేద మహిళల జీవనోపాధి కొరకు 30 కుట్టు మిషన్లు అంజేశారు. తానా సాంసృతిక కళోత్సవాలలో భాగంగా ప్రముఖ సినీ గాయకులు సింహ మరియు బృందం ప్రదర్శించిన మ్యూజికల్ నైట్ కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది.

డిసెంబర్ 29న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు (Cancer Screening Camp) లో బీపీ, షుగర్, మామోగ్రఫీ, బిఎంఐ, పాప్స్మియర్, ఛాతి ఎక్సరే, ఓరల్ పరీక్షలు, క్లినికల్ ఎగ్జామినేషన్ వంటి పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ లోకేష్ నాయుడు వదాన్యతను కొనియాడారు.

మదనపల్లె (Madanapalle) పట్టణం మరియు చుట్టు పక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులు తమకు ఆర్థిక స్వావలంబన, సాధికారత దిశగా అవకాశం కల్పించి తోడ్పాటు అందిస్తున్న లోకేష్ నాయుడు కి కృతజ్ఞతలు తెలియజేశారు.

లోకేష్ నాయుడు ప్రసంగిస్తూ భవిష్యత్తులో కూడా తానా ఫౌండేషన్ ద్వారా మదనపల్లె మరియు పరిసర ప్రాంత ప్రజలకు అవసరమైన సేవా కార్యక్రమాలు నిర్వహించే ప్రణాళిక ఉందని అన్నారు. ఈ సందర్భంగా తానా సభ్యులను, ప్రతినిధులను, స్థానిక ప్రజా ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమానికి తానా ప్రతి నిధులు మరియు రాజకీయ ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. నిరంజన్ నాని, రాజేష్ రాటకొండ, పెరవలి నవీన్, వంశీ నరసింహ, మహేష్ రాటకొండ సమన్వయం చేశారు. డప్పులు, పూలతో నాయకులకు సాదర స్వాగతం పలికారు.

మదనపల్లె తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నాయకులు రాటకొండ బాబు రెడ్డి, జయరామ నాయుడు, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరాం చిన్నబాబు, నాదెండ్ల విద్యాసాగర్, మధుబాబు మస్తాన్, ప్రశాంత్ కొప్పారపు, తాజ్ ఖాన్, దొరస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected