పేదలు, బడుగు బలహీన వర్గాలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏ.పి. భూ హక్కుల చట్టం 2022 ను రద్దు చెయ్యాలనే డిమాండుతో విజయవాడ (Vijayawada) సివిల్ కోర్టు ఆవరణలో ది బెజవాడ బార్ అసోసియేషన్ (The Bezawada Bar Association) చేస్తున్న నిరాహార దీక్షలో భాగంగా 11 వ రోజు మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు. ఈరోజు సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి కుర్రా నరేంద్ర తదితరులు సంఘీభావం తెలియజేసి దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి ప్రసింగించారు
ఈ సందర్భంగా ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ.. రాజ్యాంగ విరుద్ధమైన ఏ.పి. భూ హక్కుల చట్టం 2022 ద్వారా సత్వర న్యాయం అందిస్తామని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి (YS Jaganmohan Reddy) చెప్పటం ప్రజలను పక్క దారి పట్టించటమేనని, ఈ చట్టం వలన భూ కబ్జాదారులు నకిలీ రికార్డులు తయారు చేయించుకుని భూములను ఆక్రమించుకునే అవకాశం ఉందనీ ఈ చట్టం అమలులోకి వస్తే ఇప్పటి వరకు భూములకు ఉన్న పట్టాదారు పాసు పుస్తకము, టైటిల్ డీడ్, అడంగల్, 1బి లాంటి 30 రికార్డులు రద్దు కానున్నాయని అన్నారు.
దీని అమలు తర్వాత ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని 563 కోర్టులు చెయ్యలేని పనిని కొత్తగా వచ్చిన 26 ట్రిబ్యునల్స్ ఎలా పరిష్కరిస్తాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అత్యంత లోప భూయిష్టంగా ఉన్న ప్రజల హక్కులను హరించే విధంగా ఉన్న ఈ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని (Andhra Pradesh State Government) డిమాండ్ చేశారు.
రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి కుర్రా నరేంద్ర మాట్లాడుతూ.. అక్టోబర్ 31 నుండి అమలులోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) భూ హక్కుల చట్టం జీ.ఓ.నెం.512 తో సన్న, చిన్నకారు, బడుగు, బలహీన వర్గాల రైతులకు ముప్పు ఉందని, ప్రజా సంఘాలు, న్యాయవాదులు గత సంవత్సర కాలంగా ఘోషిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవేమి లెక్క చెయ్యకుండా ఈ రోజు జీ.ఓ.నెం.630 ద్వారా ఈ చట్టంలో చైర్ పర్సన్ గా సి.సి.ఎల్.ఏ. ను నియమిస్తూ ఆదేశమివ్వటం అత్యంత దారుణం అన్నారు.
ఈ చట్టంతో రాష్ట్ర ప్రభుత్వం పేదల భూములను కాజేసి కార్పొరేట్లకు ధారాదత్తం చేయడానికి పన్నాగం పన్నుతుందని, దీన్ని రద్దు చేసేవరకు రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, సమాజంలోని అన్ని వర్గాలు పోరాటం చెయ్యాలని సూచించారు. ఈ దీక్షా శిబిరానికి బెజవాడ (Bezawada) బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు సోము కృష్ణమూర్తి, మట్టా జయకర్, నాయకులు నామాల కోటేశ్వరరావు, కండిల వరప్రసాద్, పంగళగిరి, అక్కినేని వెంకట నారాయణ, సునీల తదితరులు సంఘీభావం తెలియచేశారు.
ఈరోజు దీక్షలో మహిళా న్యాయవాదులు (Lawyers) పి.విజయలక్ష్మి, వి.పద్మజ, కె.కనకదుర్గ, వై.నిర్మల, టి.కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.