ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా, బాపులపాడు మండలం రంగన్న గూడెం రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలలో ఈరోజు తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నాంది మినరల్ వాటర్ ప్లాంట్ ను సందర్శించి, అనంతరం గ్రామ సర్పంచ్ కసుకుర్తి రంగా మణి అధ్యక్షతన జరిగిన సభలో పాల్గొన్నారు. అంజయ్య చౌదరి ప్రసంగిస్తూ రంగన్న గూడెం గ్రామంలో గ్రామస్తులు అందరూ ఒకే త్రాటిపై ఉండి ఆర్ ఆర్ డి ఎస్ ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధికి, పేద విద్యార్థులకు చేయూత అందిస్తూ 20 సంవత్సరాల నుంచి అలుపెరగని సేవా కార్యక్రమాలు చేయడం కృష్ణా జిల్లా కే ఆదర్శమని రంగన్న గూడెం గ్రామాభివృద్ధికి తానా నుంచి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న తానా కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ కసుకుర్తి రాజా మాట్లాడుతూ రంగన్న గూడెం గ్రామానికి తనకు చిన్నప్పటి నుంచి విడదీయరాని అనుబంధం అని తన సహ విద్యార్థి కనకవల్లి శేషగిరిరావు కుమారుడు సందీప్ కు 2,3 వ సెమిస్టర్ లకు తాను ఫీజు చెల్లిస్తానని, గ్రామంలోని ఎం పి యు పి స్కూల్ కు 50 వేల రూపాయలు విలువగల పుస్తకాలను లైబ్రరీ రూపంలో తానా సంస్థ నుండి అందజేస్తానని సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఈ కార్యక్రమం అనంతరం తానా అధ్యక్షులు కమ్యూనిటీ హాల్ లో మొక్కలు నాటి గ్రామ సచివాలయం, గ్రామ పాలకేంద్రం, నిర్మాణంలో ఉన్న శ్రీకృష్ణుని గుడి ని సందర్శించారు.
ఈ కార్యక్రమంలో అమరావతి బోటింగ్ క్లబ్ సీఈవో కాకాని తరుణ్ కుమార్ ఎం పి టి సి సభ్యులు పుసులూరు లక్ష్మి నారాయణ, గ్రామ పాల కేంద్రము అధ్యక్షులు మొవ్వ శ్రీనివాసరావు, ఆర్ ఆర్ డి ఎస్ అధ్యక్షులు తుమ్మల దశరధరామయ్య పంచాయతీ కార్యదర్శి సిహెచ్ ఆంజనేయులు, సచివాలయ కార్యదర్శి ఏ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, కసుకుర్తి రాజా, కాకాని తరుణ్ తదితరులను ఆర్ ఆర్ డి ఎస్ కార్యవర్గం, ప్రజా ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.