పంచతన్మాత్ర సాయకా : ఐదు తన్మాత్రలు అను బాణములు ధరించింది.
నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా : తన సహజమైన ఎఱ్ఱని కాంతుల నిండుదనమునందు మునుగుచూ వున్న బ్రహ్మాండముల సముదాయము కలది.
‘మనో రూపేక్షు కోదండా’ – ఇది ఎనిమిది అక్షరాల, అమ్మవారి పదవ నామం. మనః= మనస్సును, రూప=రూపముగా గల్గిన, ఇక్షు=చెఱుకుగడ(అను), కోదండా=విల్లును (ధరించునది).ఎడమవైపు పైకిఉన్న చేతిలో అమ్మవారు విల్లును ధరించింది. ‘పంచతన్మాత్రసాయకా’ ఇది ఎనిమిది అక్షరాల అమ్మవారి పదకొండవ నామం. పంచ=ఐదు, తన్మాత్ర= తన్మాత్రలు అను, సాయకా=బాణములు(ధరించినది). కుడివైపు పైకి ఉన్న చేతిలో ఐదుబాణాలు ఉనాయి. ఇవి తన్మాత్ర రూపాలి – శబ్ద, స్పర్శ, రూప,రస, గంధాలు. అమ్మవారి చేతిలో మూడురకాల బాణాలు ఉంటాయి అంట. అవి స్తూలములు(పుష్పబాణాలు), సూక్షములు(మంత్రరూపబీజాక్షరాలు) మరియు కారణములు(వాసనారూపములు). ‘నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా’ – ఇది పదహారు అక్షరాల అమ్మవారి పన్నెండవ నామం. గమనిక: పొరపాటున ఈ శ్లోకాన్ని రెండుగా విడదీసి అంటే ‘నిజారుణ ప్రభాపూరా’ ‘మజ్జద్బ్రహ్మాండ మండలా’ బాణీ కోసమని విరిచి చదవకోడదు. అలా విరిచి చదివితే మజ్జద్బ్రహ్మాండ మండలా అన్నప్పుడు అమ్మవారు మునుగుతూ బ్రహ్మాండ మండల అయిపోతుంది. నిజ=తన సహజమైన, అరుణ= ఎఱ్ఱని, ప్రభా= కాంతుల, పూర=నిండుదనమందు, మజ్జత్=మునుగుతూ (తేలుచూ) ఉన్న, బ్రహ్మాండలమండలా= బ్రహ్మాండముల సముదాయము గలది.