కరచరణాదులతో కూడిన దేహమే అమ్మవారి స్థూలరూపం. అంటే విగ్రహాన్ని మమం మన చేతులతో షోడశోపచార పూజచేసి ఆరాధించాలి. ఈ స్థూలరూపమే కాకుండా అమ్మవారికి సూక్ష్మరూపం, కారణ రూపం ఉంటాయి. బీజాక్షర సమన్వితమైన ఆవిడ సూక్ష్మరూపాన్ని మన వాక్కుతో బీజాక్షర, స్తోత్రాదులు పఠిస్తూ ఆరాధించాలి. సూక్ష్మాతిసూక్షమైన ఆవిడ కారణ రూపాన్ని మనం మన మనస్సుతో ధ్యానించి, ఆరాధించాలి.
3వ శ్లోకం: ఉద్యద్భాను-సహస్రాభా చతుర్బాహు-సమన్వితా రాగస్వరూప-పాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్వలా
నామములు మరియు అర్ధాలు: 6.ఉద్యద్భాను-సహస్రాభా : ఉదయించుచున్న వెయ్యి సూర్యుల యొక్క కాంతులతో సమానమైన కాంతి కలది.
చతుర్బాహు-సమన్వితా : నాలుగు చేతులతో కూడినది.
రాగస్వరూప-పాశాఢ్యా : అనురాగ స్వరూపముగా గల పాశముతో ఒప్పుచున్నది.
ఆరవ నామం ఎనిమిది అక్షరాల సమూహం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఉద్యద్భానుసహస్రాభాయై నమః అని చెప్పాలి. ఉద్యత్ అంటే ఉదయించుచున్న, భానుసహస్ర = వెయ్యి కిరణాలు లేదా వెయ్యి సూర్యుల యొక్క, అభా= కాంతులతో సమానమైనది. చతుర్బాహుసమన్వితా ఇది లలితాదేవి యొక్క ఏడవనామం. ఇది ఎనిమిది అక్షరాల నామం. చతుర్బాహుసమన్వితాయై నమః అని నమస్కారం చేసేటప్పుడు పలకాలి. పర+ఆక్రమ=పరాక్రమ, రక్షణకే కాకుండా పరాక్రమానికి కూడా బాహువులు సంకేతాలు. జామెట్రిలో సైడ్స్ అంటే బాహువులు. ఈ నాలుగు బాహువులను చోటు గోళంలో ఉండే ఒక పెద్ద + గుర్తుగా వూహించవచ్చు. ఈనాలుగు బాహువులతో నాలుగు భాగాలౌతుంది. (1) ఖనిజ సంపద (2) వృక్ష సంపద (3) జంతు సంతతి (4) మనుష్య సంతతి. జీవపరిణామ వికాసం నాలుగు అవషలలో, నాలుగురకాల సంతతులుగా జరుతుంది, అనేది గూడా ఈ నాలుగు హస్తాలు సూచిస్తాయి.
రాగస్వరూపపాశాఢ్యా, ఇది అమ్మవారు ఎనిమిదవ నామం. రాగ=అనురాగము, స్వరూప = స్వరూపముగా గల, పాశ=పాశముతో, ఆడ్యా=ఒప్పుచున్నది. ప్రస్తుత నామంలో అమ్మవారి యొక్క రెండు ఎడమ చేతులలో – క్రిందుగా నున్న ఎడమచేతిలో ధరించిన ఆయుదం గుఱించి చెప్పబడుతుంది. దేవాతమూరుతులు ధరించే ఆయుధాలకు సంకేతాలయిన బీజాక్షరాలు ఉంటాయి. ‘ఆం” అనేది పాశానికి బీజాక్షరం. అలాగే క్రోం – అంకుసం, ఓం – ధనుస్సు, క్లీం – బాణం, శక్తి – హ్రీం, క్రీం – శూలం, శం – శంఖం. క్రోధాకారాంకుశోజ్వలా, ఇది అమ్మవారి తొమ్మిదవ నామం. ఇది ఎనిమిది అక్షరాల నామ. క్రోద – క్రోదమును; ఆకార=స్వరూపముగా గలిగిన; అంకుశ = అంకుశంతో; ఉజ్జ్వల=ప్రకాశించుతున్నది. ఈనామంలో అమ్మవారి కుడివైపున ఉన్న క్రింది చేతిలో అంకుశాన్ని ధరించి వుంటుంది. ఉజ్జ్వలమైన భవిష్యత్తును అందచేసే అమ్మవారని ఈ పదం సూచిస్తుంది. మనలో సాధనాశక్తి పెరగాలంటే అమ్మవారిని ఈనామంతో క్రోధాకారాంకుశోజ్వలాయై నమః అని జపించాలి.