టెక్సస్, డాలస్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) మరియు కార్యసిద్థి హనుమాన్ ఆలయం ఆధ్వర్యంలో “బ్రహ్మశ్రీ డా. గంగాధర శాస్త్రి గారి ‘గీతా గాన ప్రవచనం” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ప్రవాస భారతీయులు, పిల్లలు అధిక సంఖ్యలో ఈ సమావేశంలో ఉత్సాహంగా పాల్గొని సభను జయప్రదం చేశారు. కార్యసిద్థి హనుమాన్ ఆలయం లో భగవద్గీత శ్లోకాలను నేర్చుకుంటున్న పిల్లలు కొన్ని శ్లోకాలను ఆలపించి, అందరిని ఆకట్టుకున్నారు. పిల్లలకు చక్కగా భగవద్గీత నేర్పించడానికి ప్రోత్సహిస్తున్న తలిదండ్రులను, నేర్పిస్తున్న గురువులను గంగాధర శాస్త్రి గారు వారి దీవెనలతో అభినందించారు.
తానా కార్యదర్శి కొల్లా అశోక్‌బాబు కార్యక్రమాన్ని ప్రారంభించి అందరికీ ‘గీతాగాన ప్రవచనం’ కార్యక్రమానికి స్వాగతం పలికి, డా. గంగాధర శాస్త్రి గారు ముఖ్య అతిథిగా రావడం మన అదృష్టం అని, తానా తరపున వారికి ఆత్మీయ స్వాగతం పలికారు. రాబోయే కాలంలో తానా అధ్యక్షులు శ్రీ నిరంజన్ శృంగవరపు, డాలస్ ప్రాంతీయ ప్రతినిధి పరమేష్ దేవినేని మరియు తానా కార్యవర్గ బృందం సారధ్యంలో మరిన్ని మంచి మంచి కార్యక్రమలను మీముందుకు తీసుకు వస్తున్నాం అని, తానా డాలస్ లో నిర్వహించే కార్యక్రమాలలో అందరు పాల్గొనవలసిందిగా కోరారు.
తదుపరి తానా మాజీ అధ్యక్షుడు డా. తోటకూర ప్రసాద్ గారిని ఆహ్వానించి గంగాధర శాస్త్రిని సభకు పరిచయం చేయవలసిందిగా కోరారు. డా. తోటకూర ప్రసాద్ గారు వేంకట గంగాధర్ శాస్త్రి గారిని పరిచయం చేస్తూ, గంగాధర్ శాస్త్రి గారు గాయకుడు, స్వరకర్తగా మంచి కీర్తిని సంపాదించినా, సమాజానికి మేలు చేయాలనే సదుద్దేశంతో భగవద్గీత ఫౌండేషన్ ను స్థాపించి, ఆ సంస్థ ద్వారా భావి తరాలకు నిబద్దతతో వారు అందిస్తున్న సంపద ఎంతో ఉత్తమమైనదని, అన్నింటి కంటే తనకు మంచి మిత్రులు అని చెప్పి వారిని అందరి కరతాళ ధ్వనుల మధ్య సాదరంగా వేదిక పైకి ఆహ్వానించారు.
హనుమాన్ ఆలయం ఛైర్మన్ డా. వెలగపూడి ప్రకాశరావు గారు మాట్లాడుతూ భగవద్గీత స్వధర్మం వదలకుండా హిందువులు ఐకమత్యంగా సమాజంలో జరుగుతున్న అధర్మాన్ని అరికట్టడానికి పాటు పడాలని కోరారు. డా. వేంకట గంగాధర శాస్త్రి గారు మాట్లాడుతూ పరమాత్మ మనిషి అనే ప్రోడక్టును సృష్టించి దానిని ఎలా సద్వినియోగం చేయాలో అని మనకు ఇచ్చి పంపించిన ప్రోడక్టు మాన్యువల్ పేరే ‘భగవద్గీత’ అని అందరికీ సులువుగా అర్థం అయ్యేలా సరళమైన బాషలో వివరించారు.
వేదవ్యాసుల వారు రచించిన మహాభారతంలో కొన్ని పర్వాలు సారాంశం ఆధారంగా భగవద్గీతను శ్రీ కృష్ణ పరమాత్మ, అర్జునుడు కు ఉపదేశించిన సారాంశమే భగవద్గీత అని… గీతా సుగీతా కర్తవ్యా కిమన్యైః శాస్త్ర విస్తరైః యాస్వయం పద్మ నాభస్య ముఖ పద్మ విని స్సృతా!! అనే శ్లోకం ను రాగయుక్తంగా ఆలపించి దాని అర్థాన్ని వివరించారు.
శబ్దాన్ని అక్షర బద్దం చేసే శక్తి మన తెలుగు భాష మాత్రమే వుంది అని, మన మాతృ భాష ను కాపాడుకోనే బాధ్యత మన అందిరిది అని గుర్తు చేశారు. హిందువు అంటే సర్వజన బంధువు అని చెప్పారు. భగవద్గీత అన్ని గ్రంథాల సారాంశం, బాల్యం నుంచే పిల్లలకు భగవద్గీత నేర్పాలి అని, రిటైర్మెంట్ తర్వాత నేర్చుకొనే గ్రంథం కాదు అని గుర్తు చేశారు. అన్ని మత గ్రంథాలకంటే భగవద్గీత పురాతనమైన గ్రంథం అని గుర్తు చేసి, ప్రవాస భారతీయులు, అమెరికా మరియు పలు దేశాల ప్రముఖులు, తత్వవేత్తలు కూడ భగవద్గీత ప్రాముఖ్యతను కొనియాడారు అని చెప్పారు.
హిందుత్వం 5000 సంవత్సరాల క్రితం రాసిన గ్రంథం, జీవితం అంటే సుఖంగా బ్రతకడం కాదు, ధర్మంగా బ్రతకడం అదే భగవద్గీత సారాంశం అన్నారు. పిల్లలు భగవద్గీత ను చదవడం, అర్థం చేసుకోవడం, ఆచరించడం, ప్రచారం చేయడం వంటి లక్షణాలను ఆచరించాలని కోరారు. సమాజ శ్రేయస్సు కోసం మంచి పని చేయడమే మనిషి ధర్మం, దాని ఫలితం అందించడం పరమాత్మ పరమావధి అని అన్నారు. భగవద్గీతలో చర్చించని అంశం లేదు, ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది చెప్పారు.
అలాగే అనేక భగవద్గీత శ్లోకాలను రాగయుక్తంగా పాడి వినడానికి వచ్చిన శ్రోతలు అందరికీ శ్రవణానందంతో పాటు మనోవుల్లాసం కలిగేలా చేశారు. తానా ప్రస్తుత కార్యదర్శి అశోక్ బాబు కొల్లా, డా. తోటకూర ప్రసాద్, సతీష్ వేమూరి, శ్రీకాంత్ పోలవరపు, లొకేష్ నాయుడు, నాగరాజు నలజుల, చినసత్యం వీర్నపు, లెనిన్ వీర, తానా కార్యవర్గ బృంద సభ్యులు మరియు డా. ప్రకాశరావు వెలగపూడి, హనుమాన్ ఆలయం కార్యవర్గ బృందం సభ్యులు ముఖ్య అతిథి డా. గంగాధర శాస్త్ర గారిని పుష్పగుచ్చం, శాలువా, జ్ఞాపిక మరియు ‘గీతా గాన విభూషణ’ బిరుదుతో ఘనంగా సత్కరించారు.
లోకేష్ నాయుడు, శ్రీకాంత్ పోలవరపు, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, వెంకట్ ములుకుట్ల, డా. వెలగపూడి ప్రకాశరావు, డా. ప్రసాద్ తోటకూర, రావు కలవుల, డా. ఆళ్ళ శ్రీనివాస రెడ్డి, నరేంద్ర బి, గంగాధర శాస్త్రి గారి తనయుడు విశ్వతేజ, కళ్యాణి తాడిమేటి, వీర లెనిన్, లెనిన్ వేముల, నాగరాజు నలజుల, చినసత్యం వీర్నపు, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, దిలీప్ మొదలైన పలువురు పురప్రముఖులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
బ్రహ్మశ్రీ డా. గంగాధర శాస్త్రి గారి ‘గీతా గాన ప్రవచనం’ కార్యక్రమం దాతలకు, వేదికను ఇచ్చిన కార్యసిద్థి హనుమాన్ టెంపుల్ అధినేత డా. ప్రకాశరావు వెలగపూడి గారికి, వివిధ ప్రసార మాధ్యమాలకు, కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు,అన్ని సహాయ సహకారాలు అందించిన తానా ప్రాంతీయ ప్రతినిధి పరమేష్ దేవినేని కి అశోక్ బాబు కొల్లా ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేశారు.