అమరావతి వదిలిన అప్సర అవనికి వచ్చింది.
అచ్చటలేని కుసుమ సోయగం ఇచ్చట గాంచింది.
అలల వోలే పువ్వులు గాలికి ఊయలలూగుచుండెను.
ఓహో! ఎన్ని రంగులు ఎన్ని సువాసనలు!
ఆహా! మిమ్మలను గొనిపోయెదను స్వర్గమునకు.
ఆదివ్యమున మీరు వాడి పోరు కృశించరెన్నటికిని.
అమ్మా! దివ్యసుందరి! రేపటి పూల గతేమిటి?
మమ్మువరించు సీతాకోకచిలుకలు, తుమ్మెదల గతేమిటి?
పుడమిపై మాకు మర్యాదలు ఉన్నతం, ఉత్తమం, నిత్యం.
పుట్టుట-గిట్టుట ప్రకృతి నైజము.
అయినా ఎంత మంచి వారీ మనుషులు!
ఎన్నడూ వారి నవ్వులు పువ్వులనే అందురు.
మము మాలులు గట్టి శిరాగ్రమున మగువలు ధరింతురు.
మా సువాసనలు ఆఘ్రాణించిన మగడు,
మత్తునొంది మన్మద పూనిక నొంది
సతి పతిక్రియకు ఉన్మత్తులగుదురు.
ప్రతి సభలోనూ పెద్దలకు పూలగుచ్ఛములిచ్చి,
పూల మాలాంక్రుతలను చేయుదురు.
అంతిమ యాత్రలోనూ మాకు పవిత్ర పాత్రనిత్తురు.
ఎంతటి పుణ్యాత్ములు ఈ మనుష్యులు!
అంత దూరాన తాముంటూ పూలను దేవునిపై పూజిస్తారు.
పూల మాలలను దేవుడి మెడలో అలంకరిస్తారు.
స్వర్గములో లభించునా మాకింతటి అందలము?
స్వయముగా తెలుపుమా అప్సరా! మాకేది ఉచితము?
ఔను! నిజమే! ఇదియే కుసుమ విలాసం.
– కొండమూరి వి.వి. సుబ్రమణ్యం