ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, ఓర్వకల్లు మండలంలోని పొదుపు లక్ష్మి ఐక్య సంఘం బాలభారతి పాఠశాల నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలో చదువుతున్న గ్రామీణ విద్యార్థులకు కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ చైర్మన్ రవి పొట్లూరి ప్రతి సంవత్సరం తోడ్పాటు అందిస్తున్న సంగతి విదితమే.
అందులో భాగంగా ఈ సంవత్సరం ఆగష్టు 10 బుధవారం నాడు నాలుగు వందల మంది బాలభారతి పాఠశాల విద్యార్థులకు రవి పొట్లూరి సహకారంతో యాభై వేల రూపాయల విలువైన ఇన్సులేటెడ్ వాటర్ బాటిల్స్ అందించారు. లాభాపేక్ష లేకుండా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడానికి కృషి చేస్తున్న బాలభారతి పాఠశాలకు ప్రతి సంవత్సరం లాగానే 2022 లో కూడా సహాయం అందిస్తామని రవి తెలిపారు.
రవి పొట్లూరి ఆధ్వర్యంలో కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ అందిస్తున్న సహకారం మరువలేనిదని ఓర్వకల్లు పొదుపు లక్ష్మి ఐక్య సంఘం కోఆర్డినేటర్ విజయభారతి, బాలభారతి పాఠశాల ప్రధానోపాద్యాయులు క్లెమెంట్ సత్యంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో పొదుపు లక్ష్మి ఐక్య సంఘంకు చెందిన పలువురు మహిళలు, బాలభారతి పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.