Connect with us

Literary

ద్వాపరయుగంలో దేవుని పనులు పంచుకున్న పేద బ్రాహ్మణుడు

Published

on

ద్వాపరయుగంలో ఒకసారి కృష్ణార్జునులు కలిసి వెళుతున్నారు. వారికి మధ్యలో ఒక బ్రాహ్మణ యాచకుడు కనిపించాడు. చూసి జాలిపడిన అర్జునుడు అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచి నిండా బంగారు నాణేలు ఇచ్చాడు. సంతోషంగా తీసుకువెళుతున్న ఆ యాచకుడిని మార్గంమధ్యలో ఓ దొంగ కత్తితో బెదిరించి దోచుకున్నాడు. మళ్లీ ఆ పేద బ్రాహ్మణుడు యాచకుడిలా మారి వీధుల్లో భిక్షాటన చేయసాగాడు.

మళ్లీ ఓరోజు అతన్ని చూసి ఆశ్చర్యపోయిన అర్జునుడు ఈసారి ఓ ఖరీదైన వజ్రం ఇచ్చి ఆనందంగా జీవించమన్నాడు. ఆ యాచకుడు ఈసారి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి గదిలో మూలన ఉన్న, వినియోగంలో లేని ఒక కుండలో వజ్రాన్ని దాచిపెట్టి పడుకున్నాడు. తెల్లారి చూస్తే భార్య లేదు ఆ కుండ లేదు. పరుగెత్తుకుంటూ నదీతీరం వద్దకు వెళ్లాడు. భార్యను, ఆమె చేతిలోని కుండను చూసి హమ్మయ్య అనుకున్నాడు. కుండ కింద పెట్టి చూస్తే వజ్రం లేదు. నదిలో నీళ్ల కోసం వంచినప్పుడు ప్రవాహంలోకి జారిపోయింది. తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ బ్రాహ్మణుడు మళ్లీ యాచకుడిగా మారి వీధుల్లోకి వెళ్లాడు.

మళ్లీ కృష్ణార్జునులు అతన్ని విచారించారు ఏమైందని. ఇంక ఇతనికి సాయం చేసి ఉపయోగం లేదు బావా, ఇతనెవరో పరమ దురదృష్ణవంతుడిలా ఉన్నాడు అన్నాడు అర్జునుడు శ్రీ కృష్ణుడితో. లేదు అర్జునా. ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం అని బ్రాహ్మణుడి చేతిలో రెండు బంగారు నాణేలు పెట్టాడు శ్రీకృష్ణుడు. ఒకప్పుడు సంచీడు బంగారు నాణేలు, విలువైన వజ్రం ఇస్తేనే నా దగ్గర నిలవలేదు. ఈ రెండు నాణేలేమైనా నా తలరాతను మారుస్తాయా నా పిచ్చికానీ అనుకుంటూ ఇంటికెళుతున్నాడు ఆ బ్రాహ్మణుడు. దారిలో ఒక జాలరి వలకి చిక్కి విలవిలలాడుతున్న చేపను చూశాడు. అతని హృదయం ద్రవించింది. కృష్ణుడు నాకిచ్చిన రెండు నాణేలు ఎలాగూ నా తలరాతను మార్చలేవు. పాపం మూగజీవి దాని ప్రాణాలైనా రక్షిద్దాం అని తన దగ్గరున్న రెండు నాణేలూ ఇచ్చేసి ఆ చేపను తీసుకుని ఇంటికి తీసుకెళ్లి ఒక నీళ్ల గిన్నెలో ఉంచాడు. అతని భార్య ఆ చేపను చూసి అయ్యో దాని నోటిలో ఏదో ఇరుక్కుంది అండీ అందుకే గిలగిలా కొట్టుకుంటోంది అని పిలిచింది. ఇద్దరు కలిసి ఆ చేప నోరు తెరిచి గొంతులో ఇరుక్కున్నది తీసి చూసి ఆశ్చర్యపోయారు. నదిలో తాము జారవిడుచుకున్న వజ్రం అది. ఆనందంతో ఉక్కిరిబిక్కిరై దొరికింది దొరికింది నా చేతికి చిక్కింది అని గావుకేకలు పెట్టాడు. అదే సమయంలో అతనింట్లోకి ప్రవేశించిన ఓ దొంగ ఈ పేద బ్రాహ్మణుడిని చూసి కంగారుపడ్డాడు. గతంలో అతన్ని దారిదోపిడి చేసి బంగారు నాణేల సంచి దొంగలించాను, నన్ను చూసి ఆ బ్రాహ్మణుడు కనిపెట్టాను, నాది నాకు దొరికింది అని అరుస్తున్నాడు అనుకుని వణికిపోయాడు. ఆ బ్రాహ్మడు దగ్గరకి వచ్చి నీకు దణ్ణం పెడతాను, నీ బంగారు నాణేలు నువ్వు తీసేసుకో నన్ను రక్షకభటులకు మాత్రం పట్టివ్వద్దు అని ప్రాధేయపడ్డాడు. ఇప్పుడు నివ్వెరపోవడం బ్రాహ్మణుడి దంపతుల వంతయింది.

తాము పోగొట్టుకున్న రెండు విలువైన వస్తువులూ తమకు చేరాయి. పరుగు పరుగున అర్జునుడి వద్దకు వెళ్లి కృతజ్ఞతలు చెప్పాడు. కృష్ణా, నేను ఎంతో అమూల్యమైన స్వర్ణ నాణేలు, వజ్రం ఇచ్చినా అతని దశ తిరగలేదు. కానీ నీవిచ్చిన రెండు నాణేలు అతని జీవితాన్ని మలుపు తిప్పాయి ఎలా సాధ్యమైంది అని ప్రశ్నించాడు అర్జునుడు. అర్జునా, అతని వద్ద బంగారం, వజ్రం ఉన్నప్పుడు అతను కేవలం తను, తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు. అదే రెండు నాణేలు ఉన్నప్పుడు మరో జీవి మంచిచెడులు, కష్టసుఖాల గురించి ఆలోచించాడు. నిజానికి అది దేవుడి చేయాల్సిన పని. తనూ పంచుకున్నాడు. అందుకే అతని కష్టాన్ని నేను పంచుకున్నాను అని ముగించాడు శ్రీకృష్ణ పరమాత్మ.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected