కృష్ణా జలాల పునఃపంపిణీ పై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు అధికారాలిస్తూ కేంద్ర ప్రభుత్వం గజేట్ జారీ చేసిన నేపథ్యంలో దీనిమీద ఆంధ్రప్రదేశ్ కు జరిగే నష్టం పై ఈరోజు ఉదయం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజారపు అచ్చానాయుడు గారిని విజయవాడ లోని క్యాంపు కార్యాలయంలో స్వయంగా కలిసి ఒక సమగ్ర నివేదికను సమర్పించారు.
ఈ సందర్భంగా ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూ.. ఈ కేంద్ర గజెట్ వలన శ్రీ శైలం ఎగువ బాగాన అపెక్స్ కౌన్సిల్, సి డబ్ల్యూ సి, కే ఆర్ ఎం బి,దగ్గర ఏ అనుమతులు కూడా తీసుకోకుండా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న 105 టీఎంసీలతో విస్తరణ, 150 టిఎంసిల తో కొత్త ప్రాజెక్టులు పూర్తయితే శ్రీశైలం దిగు భాగాన నికర కేటాయింపులు ఉన్న నాగార్జునసాగర్ కుడి, ఏడమ కాలువల కింద ఉన్న 15 లక్షల ఎకరాలు, కృష్ణ డెల్టా పరిధిలోని 13 లక్షల ఎకరాలు, ఎస్ ఆర్ బి సి పరిధిలోని రెండు లక్షల ఎకరాలు కలిపి మొత్తం 30 లక్షల ఎకరాలకు చుక్కనీరు రాకుండా బీడుగా మారిపోయే ప్రమాదం ఉందని తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ తీవ్ర పరిస్థితిని దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం కృష్ణా జలాల పునఃపంపిణీ కి సంబంధించి చేసిన గజెట్ ను వెంటనే రద్దు చేయించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలను రద్దు చేసే వరకు రాజీలేని పోరాటం కొనసాగించి, ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులు కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.