ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా వాసులలో అమెరికాలో స్థిరపడినవారు చాలా ఎక్కువమందే ఉన్నారు. చదువుల కోసం, ఉద్యోగాల కోసం, అలాగే వ్యాపార రీత్యా అమెరికాలోని వివిధ రాష్ట్రాలలో కృష్ణా జిల్లా ఎన్నారైలు ఉన్నారు. వీరంతా గత వారాంతం తానా మహాసభలలో భాగంగా ఒక బాల్ రూమ్ లో సమావేశమయ్యారు.
ఎప్పటిలానే కృష్ణా ఎన్నారై (Krishna NRI) తరపున జులై 9న ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఈ సమావేశానికి అమెరికా నలుమూలల నుండి కృష్ణా జిల్లా ఎన్నారైలు హాజరయ్యారు. వీరితోపాటు ఇండియా నుండి విచ్చేసిన అతిరథమహారధుల నడుమ ఈ సమావేశం సుమారు 3 గంటలపాటు సాగింది.
ఉన్నత స్థానాలలో ఉండి హాజరైన అతిరథమహారధులలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (NV Ramana), రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, ఆంధ్రప్రదేశ్ మాజీ ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్, మాజీ ఐపిఎస్ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వర రావు, డా. ఇండ్ల రామ సుబ్బారెడ్డి, డా. వరుణ్ గుంటూర్ ఉన్నారు.
అలాగే తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) పొలిట్ బ్యూరో సభ్యులు & మాజీ శాసనమండలి సభ్యులు టీడీ జనార్దన్, గుడివాడ తెలుగుదేశం పార్టీ నాయకులు రాము వెనిగండ్ల, తెలుగు సినీ నిర్మాత అనీల్ సుంకర, కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు, హీల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. కోనేరు సత్య ప్రసాద్, ఆళ్ల గోపాల కృష్ణ మరియు ఎలమాటి రామనాధం ఉన్నారు.
తానా (TANA) నాయకులలో జయరాం కోమటి, అంజయ్య చౌదరి లావు, రాజా కసుకుర్తి, నాగ పంచుమర్తి, వెంకట్ కోగంటి, రాజేష్ అడుసుమిల్లి, నాని వడ్లమూడి, దిలీప్ ముసునూరు, కిరణ్ దుగ్గిరాల, అలాగే ఇతరులు కిశోర్ చలసాని, రామ్ తాతినేని తదితరులు పాల్గొన్నారు.
ముందుగా నాగ పంచుమర్తి (Naga Panchumarthi) కృష్ణా ఎన్నారై సమావేశానికి హాజరైన అందరికీ స్వాగతం పలికి ముఖ్య అతిథులను వేదిక మీదకు సాదరంగా ఆహ్వానించారు. అతిథులందరూ కృష్ణా జిల్లా (Krishna District) కి సంబంధించిన పలు విషయాలపై ప్రసంగించి తమ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
అందరూ సరదాగా జోకులు వేసుకుంటూ, పిచ్చాపాటి మాట్లాడుకుంటూ, పశ్చిమ కృష్ణా ప్రాంత మెట్ట కవ్వింపులతో ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను అందరినీ శాలువా మరియు జ్ఞాపికలతో ఘనంగా సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
అలాగే కృష్ణా జిల్లా ఆడపడుచులు డా. ఉమ కటికి ఆరమండ్ల, మాధురి పాటిబండ లను సన్మానించారు. మాధురి పాటిబండ స్వతహాగా గాయని అవడంతో కాసేపు పాటలు పాడి ఆహ్వానితులందరినీ అలరించారు. రామ్ తాతినేని వ్యాఖ్యాతగా వేదికపై కార్యక్రమాన్ని సమన్వయపరిచారు.
కృష్ణా ఎన్నారై ఫోరమ్ కార్యకలాపాలు మరియు ఇతర సేవాకార్యక్రమాల వివరాలను రాజేష్ అడుసుమిల్లి అందరికీ వివరించారు. ఫుడీఎస్ ఇన్ ఆంధ్ర నుంచి మధుకర్ నెక్కంటి షిప్పింగ్ ద్వారా పంపిన బందర్ హాల్వా, వెన్నుండలు, స్వీట్స్ తదితర కృష్ణా జిల్లా ప్రత్యేక ఫుడ్ ఐటమ్స్ ని అందరూ ఆస్వాదించారు.
కోవిడ్ అనంతరం చాలాకాలం తర్వాత కృష్ణా జిల్లా వాసులను ఇలా కలుసుకోవడం ఆనందంగా ఉందని పలువురు తెలియజేశారు. చివరిగా నాని వడ్లమూడి (Ravi Chandra Vadlamudi) కృష్ణా ఎన్నారై (Krishna NRI) సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ వందన సమర్పణతో కార్యక్రమాన్ని ఘనంగా ముగించారు.