Detroit, Michigan: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) 24వ ద్వైవార్షిక మహాసభలు డిట్రాయిట్ సబర్బ్ నోవై (Novi) లో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్ (Suburban Collection Showplace) లో 2వ రోజు వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు. కృష్ణా జిల్లా (Krishna District) ఎన్నారైల మీట్ ను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమాన్ని ప్రస్తుత జాయింట్ సెక్రటరీ వెంకట్ కోగంటితో పాటు నాగ పంచుమర్తి, రవి వడ్లమూడి, రాజా కసుకుర్తి, నరేష్ రావూరి, రాజా సూరపనేని, ఠాగూర్ మల్లినేని, పరుచూరి రామకృష్ణ సమన్వయపరిచారు. ఈ కార్యక్రమంలో ఎపి రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపిఎస్ అధికారి ఎబివి వెంకటేశ్వరరావు (ABV Venkateswara Rao) మాట్లాడారు.
ABV మాట్లాడుతూ.. కృష్ణా జిల్లాను జగన్ పాలనలో అన్యాయంగా విడగొట్టి ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాగా చేశారని, ఎన్టీఆర్ (NTR) అనే వ్యక్తి కృష్ణా జిల్లావాసి, ప్రపంచ వ్యక్తి అని అంటూ దీనివల్ల ఎన్టీఆర్ లాంటి మహానటుడు కృష్ణాజిల్లా వ్యక్తి అని చెప్బుకునే అవకాశం పోయిందని అన్నారు.
ఇక్కడ ఎపి ప్రభుత్వానికి చెందిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణంరాజు (Raghu Rama Krishna Raju) ఈ విషయంలో ఏదైనా చేయాలని కోరారు. దీనిపై రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ, తన తల్లితండ్రులు గోదావరి జిల్లా వాసులైనప్పటికీ తాను పెరిగిందంతా కృష్ణా జిల్లాలోనే అన్నారు.
విజయవాడ (Vijayawada) లోనే తన జీవితం అంతా సాగిందని అందువల్లనే చాలామంది నీకు ఆత్మాభిమానం ఎక్కువ అని అంటారని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాను ఇక నుంచి ఎన్టీఆర్ కృష్ణా జిల్లాగా మార్చాలని కోరుతానని చెప్పారు. దీనివల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదని అన్నారు.
ఈ కార్యక్రమంలో తానా (TANA) మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం (Komati Jayaram), నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, సంధ్యారాణి, నవీన్ ఎర్నేని, ప్రసాద్ గారపాటి, కిరణ్ దుగ్గిరాల, వడ్లమూడి రవిచంద్ర, లావు అంజయ్య చౌదరి, మాజీ డిజిపి ఏబీవీ వెంకటేశ్వరరావు, ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్ట్ నోరి దత్తాత్రేయుడు, తెలుగుటైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న కృష్ణా జిల్లా ప్రవాసాంధ్రుడు డా. కొడాలి నరేన్ (Dr. Kodali Naren) కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన పలువురు జిల్లా సామాజిక, సాంఘిక, రాజకీయ చరిత్రపై ప్రసంగించారు. జిల్లా అభివృద్ధికి ప్రవాసాంధ్రులు సహకరించాలని కోరారు.
నవీన్ ఎర్నేని (Naveen Yerneni), జయరాం కోమటి (Jayaram Komati), ప్రసాద్ గారపాటి, నోరిదత్తాత్రేయుడు, చెన్నూరి వెంకట సుబ్బారావు, ఆర్ఆర్ఆర్, ఎబి వెంకటేశ్వరరావు తదితరులను మెమోంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం విజయవంతానికి శ్రీనివాస వట్టికుట్టి, విజయ్ జెట్టి, నాగకుమార్ బెల్లంకొండ, భాను వేమూరి, శ్రీహరి తదితరులు కూడా సహకరించారు.