మార్చ్ 24 న కాన్సస్ సిటీ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తానా, ఆటా, నాట్స్ సహకారం అందించిన ఈ వేడుకల్లో వందలాది మంది కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ వేడుకలకు ప్రముఖ టీవీ యాంకర్, నటి, గాయని ఉదయభాను వ్యాఖ్యాతగా వ్యవహరించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం మొదలవగా ఆటలు, పాటలు, సంప్రదాయ నృత్యాలు, ఫాషన్ షో తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో సభాప్రాంగణం హోరు మంది. ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన విరాళాలను భారతదేశంలో ఎంపిక చేసిన పాఠశాలల్లో చిన్నారుల చదువు, మహిళా సాధికారత, చేనేతల అభివృద్ధి కోసం వెచ్చించనున్నట్లు కేసీటీసీఏ అధ్యక్షులు బిందు చీదెళ్ళ తెలిపారు. బిడ్డగా, చెల్లిగా, అక్కగా, భార్యగా, అమ్మగా, అత్తగా, వదినగా, అమ్మమ్మగా, నాయనమ్మగా, జేజమ్మగా, గురువుగా ఇలా మరెన్నో రూపాల్లో తన బాధ్యతలను నిర్విరామంగా సమర్ధవంతంగా నిర్వహిస్తున్న మహిళలకు ఈ వేడుకలను అంకితం చేశారు. మహిళా దినోత్సవ వేడుకలు కాన్సస్‌లో జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. చివరిగా చక్కని విందు భోజనాలతోపాటు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ, దాతలకు మరియు వాలంటీర్లకు పేరు పేరున కేసీటీసీఏ కార్యనిర్వాహకవర్గం కృతజ్ఞతలు తెలియజేయడంతో కార్యక్రమం ముగిసింది.