అక్టోబర్ 13 వ తారీఖున కాన్సస్ సిటీ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకున్నారు. కాన్సస్ నగర ఓవర్లాండ్ పార్క్ లోని లేక్ వుడ్ పాఠశాల బతుకమ్మ అట పాటలతో మార్మోగిపోయింది. గునిగిపూల సోయగాలు, తంగేడు రెపరెపలు, ఉప్పుపూల పులకరింతలు, మందార మకరందాలు, బంతి సింగారాలతో ముస్తాబై బతుకమ్మగా పూదొంతరల శిఖరాగ్రాన కాగితాలతో తయారు చేసిన 8 ఫీట్ల విగ్నేశ్వరుడు, శివుని విగ్రహాల మధ్య కాకతీయ కాళా తోరణం కింద గౌరమ్మ కొలువుతీరగా మధ్యాహ్నం 3:30 గంటలకు లలితా సహస్ర నామ పూజతో కార్యక్రమం ప్రారంభమయింది. రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి గౌరీ దేవిని ఘనంగా పూజించారు.
రేలా రే రేలా ఫేం జానపద గాయకురాలు షాలిని ఒక్కేసి పువ్వేసి సందమామ ఒక్క జాములాయే సందమామ అంటూ జానపద గీతాలను ఆలపించగా మహిళలంతా కోలాటాలు సంప్రదాయ బతుకమ్మ ఆట పాటలతో సందడి చేశారు. చేనేత కార్మికుల దుస్తుల ప్రదర్శన, జాబ్ ఫెయిర్, వెండర్ స్టాల్ల్స్ అందరిని ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంస్క్రుతిని తెలిపేలా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందని మహిళలు తెలిపారు. పూజ అనంతరం భక్తులందరికీ పూజలో కంకణాలను, జమ్మి ఆకు మరియు ఆక్షింతలు ఇచ్చారు. అన్ని కుటుంబాలు జమ్మిని పంచుకోవడం మరియు పెద్దల నుండి దీవెనలు తీసుకున్నారు. బతుకమ్మను సాగనంపే కార్యక్రమాన్ని సాంప్రదాయ తెలంగాణ సంగీత వాయిద్యంతో ఊరేగింపుగా తీసుకెళ్ళి కొలనులో నిమజ్జనం చేశారు.
దినేష్ చిన్నలచ్చయ్య, కిరణ్ కనకడండిల ఈ 12వ బతుకమ్మ పండుగ కాన్సస్ చరిత్రలోనే అతిపెద్ద బతుకమ్మ పండుగగా దిగ్విజయంగా జరిగినందుకు సభికులకు ధన్యవాదాలు తెలిపారు. కాన్సస్ సిటీ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు కిరణ్ కనకడండిల, దినెష్ చినలచైయగారి, వెంకట పుసులూరి, గౌరి చెరుకుమూడి, శ్రిదెవి గొబ్బురి, బిందు చీదెళ్ళ, మహతి మండ, విజయ్ కొండి, సరిత మద్దూరు, వెంకట్ మండ, శ్రీనివాస్ తలగడదీవి తదితరులు మరియు మిత్రులు, వాలంటీర్స్ సహాయంతో పండుగ విజయవంతముగా నిర్వహించారు.