హిందూ (Hindu Religion) మతంలో కార్తీక మాసం పరమపవిత్రమైనది. ఆ పరమ శివునికి మహా ఇష్టం కూడాను. ఈ మాసం లో సోమవారం నాడు ఉపవాసం ఉండి శివుడి (Lord Siva) ని భక్తితో పూజించిన వారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని అంటారు.
అంతటి ప్రత్యేకత ఉన్న కార్తీక మాసం అందునా చివరి సోమవారం కావడంతో జార్జియా (Georgia) రాష్ట్రం, మెట్రో అట్లాంటా, కమ్మింగ్ (Cumming) నగరంలోని శివదుర్గ గుడి (Sri Shiva Durga Temple of Atlanta) భక్తుల సందోహంతో కిక్కిరిసిపోయింది.
ప్రత్యేకంగా ఆఫీస్ సమయానంతరం, సాయంత్రం సమయాన కుటుంబ సమేతంగా దాదాపు 3000 మంది భక్తులు ఆ స్వామి దర్శనం చేసుకున్నారు.కళ్యాణం, అర్చన, మహా హారతి వంటి కార్యక్రమాలతోపాటు పూజానంతరం తీర్ధప్రసాదాలు ఏర్పాటుచేశారు.
శివునికి రుద్రాభిషేకం చేసిన ఆసాంతం భక్తులు (Devotees) అందరూ తమను తాము మైమరచిపోయారు. ఓం నమః శివాయ, శంభో శంకర అంటూ భక్తులు ఆ గరాలకంఠేశ్వరుడిని (Lord Siva) భక్తి శ్రద్ధలతో కొలిచారు.