కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం పునర్నిర్మాణం గావించిన సంగతి విదితమే. దాతలు శ్రీనివాస్ గుత్తికొండ మరియు రవి ఐకా కుటుంబాలు ధ్వజస్తంభం ప్రతిష్ఠ మొదలుకొని, ఆగష్టు 15 న మొదలైన చతుర్వేదహవన సహిత మహా కుంభాభిషేకంలో రోజూ పాల్గొంటున్నారు.
ఆరవ రోజు అనగా ఆగష్టు 20 శనివారం రోజున శ్రీ స్వామివారి దేవస్థానం చతుర్వేద హవన సహిత మహా కుంభాభిషేకం లో భాగంగా పలు పూజలు నిర్వహించారు. ఉదయం కలశధారణ, మహా పూర్ణాహుతి, కలశోద్వాసన, అష్టబంధన సమర్పణం వంటి పూజలు నిర్వహించారు.
చతుర్వేద హవన కళశమ్ జలాలలో స్వామి వారి మూలవిరాట్ కు అభిషేకం నిర్వహించారు. అలాగే సాయంత్రం తృతీయ కాల పూజ, నాడీ సంధానం, స్పర్శహుతి, విశేష ధ్రువ్యాహుతి మొదలగు పూజలు వేదపండితుల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు.
అనంతరంవివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ ఆరవ రోజు పూజా కార్యక్రమాలలో దేవస్థానం చైర్మన్ శ్రీ మోహన్ రెడ్డి గారు, దేవస్థానం కార్యనిర్వహణధికారి శ్రీ సురేష్ బాబు గారు, ఆలయ పునర్నిర్మాణ దాతలు రవి ఐకా గారు, శ్రీనివాస్ గుత్తికొండ గారు మరియు వారి కుటుంబ సభ్యులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు, ఆలయ ఏ ఈ ఓ లు, పర్యవేక్షకులు, అర్చకులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.