హిమాయత్ నగర్ లోని స్థానిక సుగుణాకర్ రావ్ భవన్ లో జులై 10న ఆసియ మరియు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు బ్లూమింగ్టన్, ఇల్లినాయిస్ లో స్థిరపడిన తెలంగాణ, నల్గొండ వాస్తవ్యురాలు కల్యాణి ముడుంబ (Kalyani Mudumba) కి అందచేసిన రెండు ప్రపంచ రికార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
ABR (Asia Book of Records) మరియు IBR (India Book of Records) ప్రతినిధి శ్రీ రాం మోహన్ రెడ్ది, ముఖ్య అతిధి కే వి రమణ (Retired IAS), విశిష్ట అతిధి వేణు గోపాలా చార్య (Ex MP) మరియు ఇతర అతిధుల సమక్షంలో కల్యాణి ముడుంబ కి ఈ రెండు రికార్డులను అందచేశారు.
ముందుగా రాం మోహన్ రెడ్ది మాట్లాడుతూ.. గత సంవత్సరం అక్టోబర్ 8, 2022 న బ్లూమింగ్టన్ (Bloomington) పట్టణం, ఇల్లినాయిస్ (Illinois) రాష్ట్రం, అమెరికాలోని స్థానిక హిందూ దేవాలయంలో కల్యాణి మ్యుజిక్ స్కూల్ (Kalyani School of Music) గురువు కల్యాణి ముడుంబ ఆధ్వర్యంలో జరిగిన “అష్టోత్తర శత సంకీర్తనార్చన” శాస్త్రీయ సంగీత కార్యక్రమం 30 కుపైగా వాగ్గేయ కారుల, 6 భాషలలో, 27 మంది సంగీత విద్యార్థులు రెండు ఖండాలు (Asia, North America) అంతర్జాలంలో మరియు ప్రత్యక్షంగా 108 సంకీర్తనలు అనర్గళంగా ఆలపించారు.
“అత్యధికంగా సంగీత కళకారులు పాల్గోని అత్యధిక భాషల్లో శాస్త్రీయ సంగీతంలో ఆలపించిన వైవిధ్య భరిత శాస్త్రీయ సంగీత” కార్యక్రమంగా గుర్తించి, కల్యాణి ముడుంబ సాధించిన ఈ ఘన విజయానికి ఒకటి కాదు ఏకంగా రెండు ప్రపంచ రికార్డులు (World Records) అందచేశామని అందరికి వివరించారు.
ముందుగా సమన్వయకర్త లక్ష్మి నాథా చార్యులు ఈ రికార్డు ప్రధానోత్సవ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యాన్ని అందరు సభాసదులకు, ఆత్మీయులకు వివరంగా వివరించారు. తరువాయి అతిధి శ్రీ కృష్ణమాచార్య సిద్దాంతి రికార్డుల గ్రహీత కల్యాణి కి వేదోక్త ఆశీర్వచనం చేసి ఆశీర్వదించారు.
ముఖ్య అతిధి కే వి రమణ మాట్లాడుతూ.. ప్రవాస భారతీయురాలు మన తెలంగాణ వాసి కల్యాణి ముడుంబ సాధించిన రెండు రికార్డుల విజయం మన తెలుగు రాష్ట్రాల వారికి ఎంతో గర్వ కారణమని, ముఖ్యంగా అమెరికా యాంత్రిక జీవనంలో తమ అమూల్య మైన సమయాన్ని వెచ్చించి చిన్నారులలో మన సంస్కృతి సాంప్రదాయల బీజాలను చిన్న నాటి నుండే నాటి ఇటువంటి వినూత్న కార్యక్రమం నిర్వహించడం మన అందరికి ఎంతో స్పూర్తి దాయకం అని ప్రశంసించారు.
సమాజ సేవలో స్త్రీ విశిష్ట భాధ్యత వహిస్తుంది అని అటువంటి పాత్రను కల్యాణి సమర్థవంతంగా పోషించారు అని ప్రత్యేక అభినందనలు తెలిపారు. తరువాత వేణు గోపలా చార్యులు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం విదేశంలో అమెరికాలో జరిగినా, స్వదేశంలో ఇక్కడ అందరి ఆత్మీయ బంధువుల మధ్య ఈ రికార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరగడం మన అందరికి ఎంతో సంతోష దాయకం అని వేనోళ్ల పొగిడారు.
కల్యాణి ఇటువంటివి ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇంకా నిర్వహించాలని, మును ముందు ఇంకా ఎన్నో విజయాలు అందుకోవలని, ఇలాగే సమాజ సేవ చేయాలని సెలవిచ్చారు. వయో వృద్దులు సంగీత విద్వాంసులు కొమాండూరి శేషాద్రి గౌరవ అతిధిగా రావడం జరిగింది. కే వి రమణ మరియు వేణుగోపాలా చార్యులు వేసవి సెలవులకు స్వదేశానికి వచ్చిన సంగీత విద్యార్థులకు రికార్డుల ప్రశంసా పత్రాలను అందచేశారు.
చివరి అంశంగా మృదంగ విద్వాంసులు పరవస్తు శ్రీనివాస్ గోపాలన్, వాయొలినిస్ట్ కొమాండూరి సౌరి రాజన్ వాద్య సహకారంతో కుమారి శ్రీనిధి గాత్ర కచేరి నిర్వహించి ఆహుతుల్ని అలరించారు. ఈ కార్యక్రమానికి కుమారి అనీశ అమరవాది వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
చివరగా కల్యాణి ముడుంబ వందన సమర్పణ చేస్తూ.. రెండు రికార్డులు అందుకున్న సందర్భంగా ABR & IBR వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ముఖ్య , విశిష్ట, గౌరవ అతిధులకు తను ఈ విజయాలు సాధించడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకారం అందించిన వారందిరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. తదనంతరం షడ్రసోపేతమైన విందు భోజనంతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.